ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేకపోయింది. అధికారం కోల్పోవడంతో.. ఆ పార్టీలో ఉన్న చోటా మోటా లీడర్ల నుంచి కీలక నేతల వరకు ఒకరి తర్వాత ఒకరు జగన్ కు బై బై చెప్పేస్తున్నారు. తాజాగా మరో కీలక నేత వైసీపీకి రాజీనామా చేశారు. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ ఫ్యాన్ పార్టీని వీడారు.
శుక్రవారం డెయిరీ డైరెక్టర్లతో సమావేశం అయిన అనంతరం ఆనంద్ కుమార్ తన రాజీనామాను ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే ప్రాధమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులన్నింటి నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. తన రాజీనామా లేఖను అధ్యక్షడు జగన్ కు పంపారు. ఆనంద్ కుమార్ తో పాటు మరో 12 మంది విశాఖ డెయిరీ డైరెక్టర్లు కూడా వైసీపీని వీడటం గమనార్హం.
కాగా, 2024 ఎన్నికల్లో ఆడారి ఆనంద్ విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి వైసీపీ యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదే సమయంలో విశాఖ డెయిరీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ రాజకీయ పార్టీలతో పాటుగా కొంత మంది పాడి రైతుల నుంచి ఫిర్యాదులు అందడంతో.. కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో శాసనసభా కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రస్తుతం విశాఖ డెయిరీలో అక్రమాలపై విచారణ చేస్తోంది. ఇటువంటి పరిణామాల నేపథ్యంలోనే విశాఖ డెయిరీ ఛైర్మన్ తో పాటు డైరెక్టర్స్ అందరూ జగన్ కు బై బై చెప్పేయడం చర్చనీయాంశంగా మారింది.