జైల్లో ఉండే ప్రముఖులకు బెయిల్ ఇప్పిస్తానంటూ వందల కోట్లు వసూలు చేసిన ఆర్థిక నేరస్తుడు.. ఆ మధ్యన జైలుపాలు కావటం.. బెయిల్ కోసం అతగాడు పడుతున్న తిప్పలు అన్ని ఇన్ని కావు. అతడిలో ఇదో కోణమైతే.. అదే జైల్లో ఉన్న తన భార్యను కలిసేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ జైల్లో దీక్ష చేస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అతడెవరో కాదు.. ఆర్థిక మోసగాడు.. వీఐపీ ఖైదీగా చెలామనీ అవుతున్న సుఖేశ్ చంద్రశేఖర్. ఎవరీ సుఖేశ్ అంటే.. రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్.. శివిందర్ సింగ్ కు బెయిల్ ఇప్పిస్తానని చెప్పి వారి భార్యల నుంచి రూ.200 కోట్లు కొల్లగొట్టింది ఇతగాడే.
మాటలు చెప్పి వందల కోట్లు కొల్లగొప్పి.. గుట్టుచప్పుడు కాకుండా ఉన్న ఇతడిపై ఫిర్యాదు చేయటంతో అతడ్ని.. అతడి సతీమణిని తిహార్ జైల్లో ఉంచారు. దాదాపు నాలుగు నెలలుగా తాము చేసిన నేరానికి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అండర్ ట్రయల్ ఖైదీగా జైల్లో ఉన్న అతను.. తన భార్యను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. దీంతో.. నిబంధనలకు అనుగుణంగా కలిసే అవకాశాన్ని ఇచ్చారు.
అయితే.. ప్రస్తుతం నెలకు రెండు సార్లు కలిసేందుకు అనుమతిస్తున్న తీరును తప్పు పడుతూ.. మరిన్నిసార్లు కలిసేలా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. దీనికి అధికారులు మౌనంగా ఉండటంతో.. అతడు దీక్ష షురూ చేశాడు. అతడి డిమాండ్ ఏమంటే.. జైల్లో ఉన్న తన భార్యను ప్రతి వారం కలిసేందుకు అనుమతి ఇవ్వాలంటున్నాడు. నిబంధనలకు విరుద్దంగా ఉన్న ఇతగాడి విన్నపానికి జైలు అధికారులు సానుకూలంగా స్పందించకపోవటంతో అతడు భోజనం చేయటం మానేశాడు.
కొద్ది రోజులుగా భోజనం మానేసి ఉంటున్న అతను.. దీక్ష చేస్తున్న కారణంగా ఆరోగ్యం క్షీణించింది. దీంతో.. అతడికి గ్లూకోజ్ లు ఇస్తున్నారు. మే 4 నుంచి మే 12 వరకు ఫుడ్ తీసుకోలేదని.. అప్పట్లో అతనికి ఇంట్రావీనస్ ఫ్లూయిడ్ లు ఇచ్చామన్నారు. మే 12 నుంచి 22 వరకు కూడా లిక్విడ్ డైట్ తీసుకుంటున్నాడని.. మళ్లీ మే 23 నుంచి ఫుడ్ తీసుకోకపోవటంతో అతడికి గ్లూకోజ్ లు ఇస్తున్నారు. మరి.. ఇతగాడు చేస్తున్న దీక్షలకు జైలు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.