టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన వి.వి.వినాయక్.. ‘సీనయ్య’ అనే సినిమాతో హీరోగా మారే ప్రయత్నం చేయడం తెలిసిందే. గత ఏడాది చాలా ఘనంగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. అంతకుముందు ‘శరభ’ అనే సినిమా తీసిన నరసింహారావు అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాల్సింది. సినిమాకు ప్రారంభోత్సవం చేశారు. షూటింగ్ కూడా మొదలుపెట్టారు. కానీ కొంత కాలానికి ఈ సినిమా వార్తల్లో లేకుండా పోయింది.
ముందుగా చిత్రీకరించిన సన్నివేశాలు చూసి నిర్మాత దిల్ రాజు సంతృప్తి చెందక సినిమాను ఆపేసినట్లు తెలిసింది. ఈ సినిమా గురించి ఈ ఏడాది అసలు చర్చే లేకపోవడంతో సినిమా ఆగిపోయిందనే నిర్ణయానికి అందరూ వచ్చేశారు. ఐతే ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో వినాయక్ మాటల్ని బట్టి చూస్తే ‘సీనయ్య’ ఆగిపోయిందని అధికారికంగా ఖరారైపోయింది.‘సీనయ్య’ గురించి ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తే.. ఈ సినిమాకు సంబంధించి జరిగిన ఏకైక సానుకూల అంశం తాను బరువు తగ్గమే అంటూ నవ్వేశారు వినాయక్. మిగతా విషయాలన్నీ ప్రతికూలమే అంటే.. ఈ సినిమా ఆగిపోయిందని చెప్పకనే చెప్పినట్లయింది. అంతకుమించి లోతుల్లోకి వెళ్లలేదు వినాయక్. మరోవైపు తాను పని చేసిన హీరోలు ఒక్కొక్కరి గురించి చెబుతూ.. బాలయ్యకు ఏమనిపిస్తే అది మాట్లాడతాడని, డ్రామా ఉండదని, ఆయన దగ్గర ఎవరైనా ఓవరాక్షన్ చేస్తే ఆయనకు నచ్చదని అన్నారు. రామ్ చరణ్ ఇచ్చిన మాటకు కట్టుబడే మనిషి అని, మాట ఇచ్చాడంటే డైరెక్టర్ హిట్లలో ఉన్నాడా, ఫ్లాపుల్లో ఉన్నాడా అన్నది పట్టించుకోవడని అన్నాడు. ఎన్టీఆర్ తిరుగులేని నటుడని.. ‘యమదొంగ’లో యముడిగా, ‘అదుర్స్’లో చారిగా నటించడం తారక్‌కు మాత్రమే సాధ్యమని, అలాంటి పాత్రలు ఈ తరం నటుల్లో ఎవరూ చేయలేరని తేల్చేశాడు వినాయక్.