ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రజల నుంచి నిరసన సెగలు ఎండాకాలం ఎండలకన్నా వేడిగా తగులుతున్నాయి. ఈ సెగలు వైసీపీ నేతలకే కాదు…గ్రామ, వార్డు వలంటీర్లకూ తగులుతుండడంతో వారంతా విపరీతమైన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే బాపట్ల జిల్లా భట్టిప్రోలులోని ఓ వలంటీర్ జగన్ సర్కార్ కు షాకిచ్చాడు.
సంక్షేమ పథకాలు అందుకున్న వారి వివరాలను సేకరించాలంటూ తనకు అందించిన సర్వే పత్రాన్ని భట్టిప్రోలులో బాషా అనే వలంటీర్ కాల్చేశాడు. అంతేకాదు, ఆ వ్యవహారాన్నంతా వీడియో తీసి అధికారులు, వలంటీర్లు ఉండే వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. తమతో గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారని, అందుకే తమలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందని వలంటీర్ బాషా వాపోయాడు. ప్రస్తుతం బాషా చేసిన పని రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులలో కూడా బాషా కన్నా ఎక్కువ ఫ్రస్ట్రేషన్ ఉందని, కానీ, బయటపడడం లేదని అంటున్నారు.
మరోవైపు, ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు నిరసన సెగ కొనసాగుతూనే ఉంది. తాజాగా కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే సాయిప్రసాదరెడ్డికి జనం షాకిచ్చారు. తమ ప్రాంతంలో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న మురుగు నీటి సమస్యపై సాయి ప్రసాద రెడ్డిని స్థానికులు నిలదీశారు. దీంతో జనంపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యేగారు…30 ఏళ్ల సమస్యను ఇప్పుడు అడుగుతారా? అంటూ మండిపడ్డారు. అంతేకాదు… తాము అధికారంలోకి వచ్చి మూడేళ్లే అయ్యిందని, తర్వాత పరిష్కరిస్తామని చెబుతూ అక్కడి నుంచి రుసరుసలాడుతూ మెల్లగా జారుకున్నారు.