ప్రజలకు అన్నీ చేస్తున్నామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం.. ఆ అన్నీలో దాడులను కూడా చేర్చినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే..ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులైన వారు ఎక్కడున్న వెతికి మరీ పట్టుకుని వారికి ఆయా పథకాలను అందిస్తున్నట్టు చెప్పుకొనే వైసీపీ ప్రభుత్వం తాజాగా విజయవాడలో ఒకమహిళ తన భర్త వైసీపీలోనే తిరిగేవాడని.. హఠాత్తుగా చనిపోయాడని.. తనకు వితంతు పింఛను మంజూరు చేయాలని కోరారు.
అయితే.. ఆమెపై ఆగ్రహించుకున్న వైసీపీ నాయకులు.. ఈ ఘటన జరిగిన తెల్లారి కక్ష పెట్టుకుని మరీ ఇంటికి వెళ్లి కారం, రాళ్లు సహా.. కర్రలతో దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన రాజకీయంగా దుమారం రేపింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. దాడి చేసిన వైసీపీనాయకులను కాకుండా.. బాధిత మహిళ, ఆమె బంధువులను పోలీసులు స్టేషన్కు తరలించి బైండోవర్ కేసులు నమోదు చేశారు.
ఏం జరిగిందంటే..
విజయవాడలోని తూర్పు నియోజకవర్గం పరిదిలో ఉన్న రాణిగారితోటకు చెందిన రమీజా పేద ముస్లిం మహిళ. నాలుగేళ్ల క్రితం భర్త హఠాత్తుగా చనిపోవటంతో పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న దేవినేని అవినాష్ టీడీపీలో ఉన్నప్పుడు ఆయన మద్దతురాలిగా ఉన్న రమీజా… అవినాష్ వైసీపీలో చేరిన తరువాత కూడా ఆయన వెంటే ఉన్నారు.
ఈ క్రమంలో తనకు వితంతు ఫించన్ ఇప్పించమని ఎన్నోసార్లు వేడుకున్నారు. అయినప్పటికీ ఫలితం లేకపోవటంతో ఇటీవల గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అవినాష్, స్థానిక నేతలు తన ఇంటికి రావడంతో తన పింఛన్ సమస్యపై నిలదీసింది. అంతే తెల్లారేసరికి కార్పొరేటర్ రామిరెడ్డి, 20మంది వైసీపీ మహిళా కార్యకర్తలు ఉదయాన్నే వచ్చి రమీజాపై దాడికి దిగారు. సామాన్లు ధ్వంసం చేశారు.
ముఖ్యంగా కార్పొరేటర్ రామిరెడ్డి.. కారం ప్యాకెట్లు తెచ్చి ఆడవాళ్లందరికీ ఇచ్చాడని బాధితురాలు వాపోయింది. మాట్లాడుతూనే కళ్లలో కారం కొట్టారని పేర్కొంది. జుట్టు పట్టుకొని కొట్టారని తెలిపింది. నెత్తురు కనబడకుండా కొట్టమన్నాడని వాపోయింది. ఇదిలావుంటే, రమీజాపై దాడికి పాల్పడిన వారిని వదిలేసి, బాధితుల్ని కృష్ణలంక పీఎస్కు తరలించటం, వారిని బైండోవర్ చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది.