అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల, కుక్క పిల్ల….కాదేది కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీ శ్రీ….ఈ మాటలకు బాగా ఇన్స్ పైర్ అయిన వైసీపీ నేతలు….చెట్టు, పుట్ట, కరెంటు స్తంభం, బోరింగు, ప్రభుత్వ కార్యాలయాలు, చెత్త సేకరించే బండ్లు కావేవీ వైసీపీ రంగులకనర్హం అని జగనన్న జమానాలో నయా కవులుగా మారడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఓ పక్క ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయొద్దు మొర్రో అని కోర్టు మొత్తుకుంటున్నా…వైసీపీ నేతలు మాత్రం…భారతీయులకు జాతీయ జెండా మాదిరిగా తమకు వైసీపీ జెండా అని ఫీలవుతున్న వైనంపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం వైసీపీ అధినేత జగన్ మరోసారి తన రంగుల కలను సాకారం చేసుకోబోయి భంగపడ్డ వైనం తీవ్ర చర్చనీయాంశమైంది.
చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు మొట్టికాయలు వేసింది. అయినా, సరే తగ్గేదే లే అన్న రీతిలో ఉన్న వైసీపీ నేతలు…తాజాగా చెత్త సేకరించే వాహనాలకూ వైసీపీ జెండా రంగులు వేయడంపై హైకోర్టు అక్షింతలు వేసింది. దీంతో, ఈ వ్యవహారంపై అఫిడవిట్ దాఖలు చేసిన ఏపీ సర్కార్….ఇకపై భవష్యత్తులో ఏ ప్రభుత్వ కార్యాలయానికిగాని, వాహనానికిగాని వైసీపీ రంగులు వేయబోమంటూ హామీ ఇచ్చారు.
అలా హామీ ఇచ్చిన వైసీపీ నేతలు గంటలు గడవక ముందే మాట తప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, వాహనాలకు వేయబోమని చెప్పాంగానీ….ఆలయాలకు వేయబోమని చెప్పలేదుగా అనుకున్నారో ఏమో గానీ….తాజాగా బెజవాడలో కనకదుర్గమ్మ ఆలయానికి కూడా వైసీపీ జెండా రంగులు వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలో జరగబోయే విజయ దశమిని పురస్కరించుకొని ప్రతి ఏటా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం, కనక దుర్గమ్మ ఆలయాన్ని అంగరంగ వైభవంగా అలంకరించడం ఆనవాయితీ.
అయితే, వైసీపీ నేతలు మాత్రం…ఇక్కడ కూడా తమ రంగుల కల నెరవేర్చుకోవాలన్న తపనలో ఆలయానికి రంగు రంగుల విద్యుత్ బల్బుల దండలు వేయడానికి బదులుగా…తమ పార్టీ జెండా రంగులు వేసి మరోసారి మొట్టికాయలు తినేందుకు సిద్ధమయ్యారు. దీంతో, వైసీపీ నేతల రంగుల పైత్యం ముదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వైసీపీ నేతలూ…ఈ రంగుల ఫ్యాంటసీ ఏంటయ్యా…అని ట్రోల్ చేస్తున్నారు.