విజయవాడను ముంచెత్తిన వరదలతో ప్రజలు లక్షల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ఆ వెంటనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దిక్కుకో చోటకు వెళ్లిపోయారు. ఆకస్మిక వరదలు… వర్షాలతో విజయవాడ.. ఒక రకంగా చివురుటాకునే తలపించింది. ఇక్కడి ప్రజలను రక్షించడం.. వారిని తిరికి సాధారణ స్థాయికి తీసుకురావడం వంటివి పెద్ద ఎత్తున సర్కారుకు సవాలుగా మారాయి. ఈ నేపథ్యమే చంద్రబాబు డైరీలో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని చేర్చింది.
విపత్తులను సైతం అవకాశాలుగా మలుచుకుంటానని చెప్పే చంద్రబాబు.. అచ్చం అలానే చేశారు. వరదల తాకిడితో అల్లాడిపోయిన విజయవాడను ఆదుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేశారు. అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయం.. చంద్రబాబు ఈ పది రోజుల కాలంలో చేసిన పనితీరు. ఒకవైపు పాలనను.. మరోవైపు… బాధితులను మేనేజ్ చేయడం.. వారికి సౌకర్యాలు కల్పించడం వంటివి చంద్రబాబు విజన్‌కు తార్కాణం.
ఎన్నో సమస్యలు..
ఒకే సమయంలో నాలుగు నుంచి ఐదు రకాల సమస్యలు చంద్రబాబును వెంటాయి. ఇదంతా కేవలం 10 రోజులలోనే జరిగింది. అయినా.. వాటిని సమర్థవంతంగా చంద్రబాబు ఎదుర్కొన్నారు. ఆకస్మిక వరదలతో విజయవాడ శివారు మునిగింది. దీని నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించడం ఒక సమస్య. ఇక, వారికి ఆహారం, తాగునీరు అందించడంతో పాటు ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన పరిస్థితి కూడా చంద్రబాబుకు తలకు మించిన భారంగా మారింది.
మరోవైపు.. బుడమేరుకు పడిన భారీ గండిని పూడ్చేందుకు శ్రమకోర్చాల్సి రావడం. ఇక, నాలుగోది.. ప్రకాశం బ్యారేజీని ఇనుప పడవలు ఢీకొట్టిన ఘటన. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంటూనే.. మరోవైపు పార్టీ పరంగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యవహారంపైనా చంద్రబాబు సమయానికి తగిన విధంగా స్పందించారు. ఇవన్నీ ఇలా ఉంటే.. కేంద్రం నుంచి వచ్చే సాయం.. కేంద్ర బృందాలకు సహకారం.. అధికారులతో సమీక్షలు.. తొలి రెండు మూడు రోజులు వారు సహకరించడం లేదన్న వాదన వెరసి చంద్రబాబుకి విజయవాడ ఒక ప్రత్యేక పేజీగా మారింది.