సీఎం కేసీఆర్ పై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసమే లాక్ డౌన్ ఎత్తివేశారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలంటే శుద్ధ అమాయకులని, వారిని ఇట్టే మోసం చెయ్యవచ్చనేది కేసీఆర్ విశ్వాసమని మండిపడ్డారు. నిన్నటి వరకు లాక్ డౌన్ పెట్టిన కేసీఆర్….సడెన్ గా లాక్ డౌన్ ఎత్తివేయడం…మరుసటి రోజే సిద్ధిపేటలో ప్రారంభోత్సవాలు చేయడంపై విమర్శలు గుప్పించారు.
తన దత్తత గ్రామంలో వేలాదిమందితో కేసీఆర్ సామూహిక భోజనాలకు కూడా ప్లాన్ వేశారని, కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టకుండానే ఇలా చేయడం కేసీఆర్ నిర్లక్ష్యానికి కారణమని నిప్పులు చెరిగాయి. కరోనా తగ్గిపోయిందని కార్యక్రమాలు పెట్టారో… ఈ రాజకీయ కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల కోసం కరోనా తగ్గిపోయిందని తప్పుడు నివేదికలు తెప్పించారో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గ్రహించలేని వెర్రివాళ్ళు కాదని దుయ్యబట్టారు.
జులై నుంచి విద్యా సంస్థల్ని తెరిచేందుకు అనుమతులిచ్చి విద్యార్థుల ప్రాణాల్ని పణంగా పెట్టేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని, తల్లిదండ్రులు వద్దన్నా వినకుండా బడులు తెరుస్తామనడం ఏమిటని నిదీశారు. పొరుగునున్న మహారాష్ట్రలో కొవిడ్ డెల్టా ప్లస్ వేరియంట్ భయపెడుతోందని, ఆంధ్రా సహా పలు పొరుగు రాష్ట్రాలు లాక్ డౌన్ కొనసాగిస్తున్నాయని గుర్తు చేశారు.
త్వరలోనే థర్డ్ వేవ్ ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తుంటే…దానికి సన్నద్ధం కాకుండా లాక్ డౌన్ ఎత్తివేయడం కేసీఆర్ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని రాములమ్య దుయ్యబట్టారు. కేసీఆర్ సర్కారు బారిన పడినందుకు తెలంగాణ ప్రజలు ఆందోళన చెందని రోజు లేదనడం ఏమాత్రం అతిశయోక్తి కాదని రాములమ్మ విమర్శించారు.