అందరు అనుమానిస్తున్నట్లుగానే సీనియర్ నేత విజయశాంతి @ రాములమ్మ బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. బుధవారం తన రాజీనామా లేఖను కేంద్రమంత్రి, తెలంగాణా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. రాములమ్మ బీజేపీకి గుడ్ బై చెప్పేయటం ఖాయమని చాలాకాలంగా అందరు అనుమానిస్తున్నదే. తనకు పార్టీలో ప్రాధాన్యత దక్కటంలేదని విజయశాంతి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. తన సేవలను పార్టీ సక్రమంగా ఉపయోగించుకోవటంలేదన్నది ఆమె వాదన.
ఇదే సమయంలో పార్టీ కార్యక్రమాల్లో విజయశాంతి సరిగ్గా పాల్గొనటంలేదని పార్టీ ఆరోపిస్తోంది. తనంతట తానుగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను చేపడితే పార్టీలో ఎవరైనా అడ్డుకున్నారా అని పార్టీ నేతలు ఆమెను అడుగుతున్నారు. పార్టీ చేసిన ఎన్నికార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారో లెక్క చెప్పాలని నిలదీస్తున్నారు. రెండువైపుల నుండి పరస్పర నిందారోపణలు, విమర్శలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే నరేంద్రమోడీ తెలంగాణా పర్యటనల్లో కూడా విజయశాంతి ఎక్కడా కనబడటంలేదు.
అమిత్ షా వచ్చినా కూడా పార్టీ కార్యక్రమాలకు, బహిరంగసభల్లో కూడా హాజరుకాలేదు. దాంతోనే రాములమ్మలో అసంతృప్తి ఏ స్ధాయిలో పెరిగిపోయిందో అందరికీ అర్ధమైపోయింది. ఇదే నేపధ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో రాములమ్మకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. అలాగే స్టార్ క్యాంపెయిర్ల జాబితాలో కూడా ఆమెకు చోటు దక్కలేదు. ఏదో రోజు ఆమె పార్టీని వదిలేయటం ఖాయమని తెలిసిన కారణంగానే విజయశాంతిని పార్టీ అగ్రనేతలు పట్టించుకోలేదని అర్ధమైపోయింది. పార్టీలో జరుగుతున్నది చూసిన తర్వాత ఫైనల్ గా విజయశాంతి రాజీనామా చేసేశారు. తొందరలోనే తన మద్దతుదారులతో కలిసి ఆమె కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు సమాచారం.
గట్టిగా చెప్పాలంటే విజయశాంతి ఏ పార్టీలో కూడా ఇమడలేరన్నది వాస్తవం. ఎందుకంటే తన స్ధాయిని ఆమె చాలా ఎక్కువగా ఊహించుకోవటమే అసలు సమస్య. సినిమాల్లో సూపర్ స్టార్ స్టేటస్ ను అనుభవించిన విజయశాంతి పాలిటిక్స్ లో కూడా అదే స్ధాయిని అనుభవించాలని కోరుకుంటున్నారు. అయితే అది సాధ్యంకావటంలేదు. సినిమాలు వేరు రాజకీయాలు వేరన్న విషయం విజయశాంతికి అర్ధంకావటంలేదు. ముందు తన కెపాసిటిని ప్రూవ్ చేసుకుని తర్వాత పార్టీలో ప్రాధాన్యత కోరటంలో తప్పులేదు. కానీ అలాకాకుండా తాను ఏ పార్టీలో ఉన్నా రెడ్ కార్పెట్ పరచాలని కోరుకుంటుండటమే అసలైన సమస్య.