సీఎం జగన్ హయాంలో వైసీపీ నేతలు అందినకాడికి దోచుకుంటున్నారని విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పార్టీలో నెంబర్ 2గా కొనసాగుతోన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ దోపిడీలో కీలక పాత్ర పోషిస్తున్నారని విపక్ష నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించక ముందే విజయసాయి అక్కడ పాగా వేసి భూదందాకు తెరలేపారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.
దీంతోపాటు, 108 అంబులెన్సుల కొనుగోలు కాంట్రాక్టును విజయసాయి రెడ్డి తన అల్లుడి కంపెనీకి కట్టబెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఆ వివాదం సద్దమణగక ముందే తాజాగా విజయసాయి తన బంధువులకు ఓర్వకల్లు విమానాశ్రయంలో వాటాను టాటా సాల్ట్ అమ్మినంత ఈజీగా అమ్మేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నిర్మించిన విమానాశ్రయంలో సగం వాటాను అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ కు జగన్ సర్కార్ అమ్మబోతోందని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే కాకినాడ ఎయిర్ పోర్టులో సగ భాగాన్ని అరబిందో రియాలిటీకి జగన్ సర్కార్ అమ్మేసింది. అరబిందో రియాలిటీ కంపెనీ ఎండీలుగా రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నేత విజయసాయిరెడ్డి బంధువులకు చెందినదని తెలుస్తోంది. ఈ కంపెనీ ఇన్వెస్టర్లుగా వైఎస్ భారతి, వైఎస్ సునీల్ రెడ్డి, ఈ కంపెనీ డైరెక్టర్లుగా రోహిత్ రెడ్డి పెనక, సంపత్ కుమార్ రెడ్డి, పెనక సునీలా రాణి ఉన్నారని తెలుస్తోంది. ఇలా, అధికారాన్ని అడ్డుపెట్టుకొని విజయసాయి తన బంధువులకు తాయిలాలు పంచిపెడుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.