ఏపీ అధికార పార్టీ వైసీపీలో అల్లుడిగారి గిల్లుడు ఎక్కువైందనే కామెంట్లు.. సీనియర్ నేతల మధ్చ తరచుగా వినిపిస్తున్నాయి. ఇది అది అలా చర్చల్లో నాని నాని.. మీడియా వరకు వచ్చింది. ఇప్పుడు కొందరు బహిరంగంగానే దీనిపై చర్చించుకుంటున్నారు. ఇంతకీ.. అల్లుడుగారు ఎవరు? ఎలా గిల్లుతున్నారు? అనే ప్రశ్నలు సహజంగానే తెరమీదికి వస్తాయి.
వైసీపీలో అవినీతికి తావులేదని సీఎం జగన్ సహా అనేక మంది నాయకులు నిత్యం చెబుతున్నారు. అయితే.. అదేసమయంలో అధికారికంగా మాత్రం తమ వారికి మేలు చేసే కార్యక్రమాలకు మాత్రం నిత్య తెరదీస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే `అల్లుడి`గారి గిల్లుడు ఎక్కువైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
విషయంలోకి వెళ్తే.. వైసీపీ కీలక నాయకుడు.. వి విజయసాయిరెడ్డి అల్లుడు అరబిందో ఫార్మాలో భాగస్వామి. ఆయనకు మేళ్లు జరిగేలా.. వైసీపీ సర్కారు అధికారికంగానే నిర్ణయాలు తీసుకుంటుండడం… ఈ క్రమంలో తనకు తానే సంకల్పించుకున్న రివర్స్ టెండరింగ్‌ను కూడా పక్కన పెట్టడం వంటివి చర్చనీయాంశంగా మారాయి. జగన్ ప్రభుత్వం చేపడుతున్న పలు ప్రాజెక్టులు సహా గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్టులు కూడా ఇప్పుడు అరబిందో ఖాతాలోకే చేరుతున్నాయట.. ఇది మా ఆరోపణ కాదు… ఈ విషయం వైసీపీ సీనియర్లే చర్చించుకుంటున్నారు. దీనిలో కీలకమైన ప్రాజెక్టు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి.
ప్రతిపక్షంలో ఉండగా ఈ విమానాశ్రయంపై వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు, ఆయన పరివారం ఈ విమానాశ్రయం నుంచి దోచేశారని విమర్శలు సంధించారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత.. మళ్లీ జీఎంఆర్ కి ఇచ్చినట్టే ఇచ్చి.. లోపాయికారీగా మెజారిటీ వాటాల(51 శాతం)ను అరబిందో దక్కించుకునేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇక, ఏపీకి బల్క్ డ్రగ్ పార్కు కేటాయిస్తే అది కూడా అరబిందో చేతికే వెళుతుందనేది వైసీపీ నేతల మాట.
మరోవైపు కాకినాడలోని సీపోర్ట్స్ లిమిటెడ్ లో అరబిందో రియాల్టీకి 41.12 శాతం వాటా బదిలీకి అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది కూడా సాయిరెడ్డి అల్లుడికి చెందిన సంస్థకే దక్కడం గమనార్హం. మొత్తానికి అల్లుడిగారి కోసం.. సాయిరెడ్డి బాగానే కష్టపడుతున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.