విశాఖలో ఇటీవల జరిగిన సభలో సీఎం జగన్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా డైరెక్ట్ గా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బీజేపీ అండ తనకు ఉండకపోయినా జనం అండ ఉంటే చాలు అంటూ జగన్ కూడా కౌంటర్ ఇవ్వడం షాకింగ్ గా మారింది. దీంతో, బీజేపీతో వైసీపీకి ఉన్న మిత్రబంధం అధికారికంగా తెగిపోయినట్లయింది. ఆ తర్వాత వైసీపీ, బీజేపీ నేతల మధ్య తారస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే బీజేపీపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. కొంతకాలంగా సైలెంట్ మోడ్ లో ఉన్న విజయసాయి షా, నడ్డాల వ్యాఖ్యలపై స్పందించారు. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎప్పుడూ సమన్వయం ఉంటుందని అన్నారు.
వైసీపీ పాలనలో అవినీతి జరిగిందని వారు ఆరోపించారని, కానీ, ఎక్కడ జరిగిందో చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు.
ఆడిటింగ్ లో ఏమైనా అవినీతిని గుర్తించారా? అని విజయసాయి ప్రశ్నించారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చలేదని, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ వైసీపీ పొత్తు పెట్టుకోదని చెప్పారు. ఏపీ పరిపాలన రాజధాని విశాఖలోనే ఉంటుందని విజయసాయి క్లారిటీనిచ్చారు. మరి, విజయసాయి వ్యాఖ్యలపై బీజేపీ నేతల స్పందన ఏవిధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.