గురివింద గింజకు దాని కింద ఉన్న నలుపు కనిపించదు…ఒక వేలు అవతలి వారి వైపు చూపిస్తే నాలుగు వేళ్లు మనవైపు చూపిస్తాయి…డ్యామిట్ కథ అడ్డం తిరిగింది…ఇటువంటి సామెతలు, డైలాగులు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి రాజ్యసభలో తాజాగా చేసిన వ్యాఖ్యలకు అతికినట్లు సరిపోతాయి. చంద్రబాబు పరువు రాజ్యసభలో తీయాలని స్పీచ్ మొదలెట్టిన విజయసాయి..చివరకు తన పరువు, జగన్ పరువు స్వయంగా తీసుకున్న వైనం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెద్దల సభలో తమ పార్టీ పెద్ద జగన్ పరువు తీసిన సాయిరెడ్డి వ్యవహారం ఇపుడు చర్చనీయాంశమైంది.
రాజ్యసభలో చంద్రయాన్ పై మాట్లాడతానంటూ మైక్ తీసుకున్న విజయసాయి…చంద్రబాబుపైకి టాపిక్ డైవర్ట్ చేసి విమర్శలు గుప్పించడం మొదలుబెట్టారు. ఆ విమర్శలు తర్వాత కాంగ్రెస్ మీదకు వెళ్లి..విపక్షాల దగ్గర ఆగాయి. సెల్ ఫోన్, కంప్యూటర్ తానే కనిపెట్టానని చంద్రబాబు అంటుంటారని విజయసాయి మాట్లాడిన మాటలు సభలో నవ్వులు పూయించాయి. అయితే, విజయసాయి మాట్లాడడం ఆపిన తర్వాత ఆయనపై వామపక్ష ఎంపీ ఒకరు చేసిన వ్యాఖ్యలు ఆయనను ఇరకాటంలో పడేశాయి.
బెయిల్ మీద ఉన్న నాయకుడు.. జైల్లో ఉన్న నాయకుడిని ప్రశ్నిస్తున్నారని ఆయన వేసిన సెటైర్ ఓ రేంజ్ లో పేలింది. దీంతో, బాబును ఇరికించాలని ట్రై చేసిన విజయసాయి చివరకు తనతో పాటు జగన్ ను కూడా ఇరికించారని టాక్ వస్తోంది. అందుకే, పెద్దల సభలో చంద్రబాబు వంటి పెద్దమనిషి గురించి మాట్లాడేటపుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.