సీఎం జగన్ తర్వాత వైసీపీలో నంబర్ 2గా కొనసాగుతోన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. అక్రమాస్తులు, అవినీతి ఆరోపణలు, క్విడ్ ప్రోకో కేసుల్లో జగన్ ఏ1 అయితే…విజయసాయి ఏ2 అని…పార్టీలోనూ వీరిద్దరూ ఏ1, ఏ2లుగా కొనసాగుతున్నారని విపక్షాలు దుయ్యబడుతున్నాయి. ఇక, పాలనా రాజధాని అంటూ విశాఖను ఎంచుకున్న జగన్…అక్కడ వేల కోట్ల రూపాయల విలువైన స్థలాలు, భూములు అప్పణంగా దోచుకునేందుకు విజయసాయిని నియమించారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా సాయిరెడ్డిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ వాల్తేర్ క్లబ్‌పై ఏ2..విజయసాయిరెడ్డి కన్నుపడిందని రఘురామ విమర్శలు గుప్పించారు. క్లబ్‌కు ఉన్న16 ఎకరాల భూమిలో 10 ఎకరాలను ఇవ్వాలని ఏ2 అడుగుతున్నారని తనకు తెలిసిందని రఘురామ వ్యాఖ్యానించారు. విశాఖపట్నానికి విజయసాయికి సంబంధం ఏమిటని, ఆయనేమన్నా ఉత్తరాంధ్రకు మంత్రా అని ప్రశ్నించారు. విజయసాయి కేవలం ఒక రాజ్యసభ సభ్యుడని చెప్పారు.
అమరావతే ఏపీకి రాజధాని అని, ఆ అంశంపై హైకోర్టులో స్టే ఉన్నప్పుడు రాజధాని మార్పు ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. న్యాయ దేవతను నమ్ముకున్న మహిళలు, రైతులు ఎవరూ అధైర్యపడొద్దని రఘురామ ధైర్యం చెప్పారు. మంత్రి బొత్స, జగన్ కలలు కలలుగానే మిగిలిపోతాయని భరోసా ఇచ్చారు. ఈడీ కేసులను విచారణ చేస్తామని సీబీఐ, హైకోర్టు చెప్పాయని, దీనిపై విజయసాయి సుప్రీంకు వెళ్తామని అంటున్నారని.. ఇంకా సుప్రీంలో పిటిషన్ వేయలేదని రఘురామ గుర్తు చేశారు.