వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన విజయసాయిరెడ్డి…జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉండేవారన్న సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసుల్లో ఏ1 జగన్ తర్వాత ఏ2గా…జగన్ తర్వాత వైసీపీలో నెంబర్ 2గా…సాయిరెడ్డి చాలాకాలం కొనసాగారు. అయితే, జగన్ తో వి.సా.రెడ్డికి చెడిందని, అందుకే ఇపుడు జగన్ తర్వాత సజ్జల సకల శాఖల మంత్రిగా, వైసీపీలో నంబర్ 2గా కొనసాగుతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు, త్వరలో రాజ్యసభ సభ్యుడిగా సాయిరెడ్డి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో మరోసారి ఆయనకు కొనసాగింపు ఉండకపోవచ్చని ప్రచారం జరుగుతోంది.
ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఈ ఏడాది జూన్ 21తో ముగియనన్న నేపథ్యంలో సాయిరెడ్డి పొడిగింపు వ్యవహారం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. రాజ్యసభ సభ్యుల ఎంపికకు 2022 మార్చిలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఆ 4 స్థానాలూ ఆ పార్టీకే దక్కుతాయి. దీంతో, ఆ నలుగురు ఎవరో వైసీపీలో ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. ఆ నలుగురిలో మొదటగా ప్రధాని మోడీకి సన్నిహితుడిగా పేరున్న అదానీకి చోటు దక్కనుందని తెలుస్తోంది. ఒకవేళ అదానీ కాకపోతే ఆయన చెప్పిన వ్యక్తికి సీటు ఇచ్చే అవకాశముంది. ఆ తర్వాత గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి పార్టీ తరఫున ఇద్దరికి రాజ్యసభ సీటు దక్కనుందట. ఇక, నాలుగో స్థానంలో వి.సా రెడ్డిని మళ్లీ పంపే ఆలోచన మాత్రం జగన్ కు లేదట.
సామాజిక సమీకరణాల ప్రకారం కూడా సాయిరెడ్డికి రెన్యూవల్ చేయరని తెలుస్తోంది. అయితే, విజయసాయి ప్లేస్ లో సజ్జలను పెద్దల సభకు పంపాలని జగన్ అనుకున్నారట. కానీ, ఏపీలో ప్రస్తుతం అనధికారిక సీఎంగా వ్యవహరిస్తున్న సజ్జల ఢిల్లీ వెళితే జగన్ ఒంటరి అయిపోతారని ఆ ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నారట. బీసీ, ఎస్సీ, మైనార్టీ కోటాలలో మిగతా మూడు రాజ్యసభ సీట్లు ఇవ్వాలని జగన్ అనుకుంటున్నారట. ఆ లెక్కన చూసినా..సాయిరెడ్డికి మొండి చెయ్యి తప్పదంటున్నారు. ఇక, తప్పనిసరి పరిస్థితుల్లో ఏ2గా సాయిరెడ్డి పడ్డ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని జగన్ మరోసారి ఆయనకు సీటు ఇచ్చినా ఇవ్వొచ్చన్నది మరొక వాదన. ఏది ఏమైనా…ఈ సీట్ల పందేరం జరిగేసరికి వైసీపీలోని లుకలుకలు మరోసారి బయటపడే అవకాశముందని తెలుస్తోంది.