విజయసాయిరెడ్డి… వైసీపీ ముఖ్య నేత. ఏపీ అధికార పార్టీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతగా వార్తల్లో నిలుస్తుంటారో విజయసాయిరెడ్డి సైతం అంతే. అయితే, తాజాగా ఆయన మరో పరిణామంతో అందరి దృష్టిని ఆకర్షించారు. అదేంటంటే… ఎప్పుడూ చేసే పని చేయకపోవడం వల్ల! అదేనండి… ట్విట్టర్లో క్రియాశీలంగా ఉండే విజయసాయిరెడ్డి తాజాగా ఆ పని చేయకపోవడంతో విపక్ష తెలుగుదేశం టార్గెట్ చేసింది.
వివరాల్లోకి వెళితే, ఏపీ ప్రభుత్వ సలహాదారులు అజేయ కల్లం విలేకరుల సమావేశంలో సంచలన విషయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జిగా పనిచేస్తున్న జస్టిస్ రమణ వివిధ అంశాల్లో జోక్యం చేసుకుంటున్నారని, న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌కు అనుకూలంగా జడ్జిమెంట్లు ఇచ్చారని, వారితో కలిసి రాజధాని భూములు కొనుగోలు విషయాలపై రాసిన ఆ లేఖను బహిర్గతం చేశారు. ఈ పరిణామం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అయితే, దీనిపై విజయసాయిరెడ్డి ట్విట్టర్లో స్పందించలేదు. ఎలాంటి ట్వీట్లు చేయలేదు.
ఈ నేపథ్యంలో, ట్విట్టర్లో టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. “ప్రపంచంలో ప్రతి విషయంపైనా ట్విట్టర్లో ఎగిరి దూకే విజయసాయి రెడ్డి జడ్జీలపై జగన్ రెడ్డి రాసిన లేఖపై కిక్కురుమనడం లేదు ఎందుకని? రెచ్చిపోతే బెయిల్ రద్దు అవుతుందని భయమా? లేకపోతే అప్రూవర్ గా మారిపోయి అసలు గుట్లన్నీ బయట పెట్టేద్దామనా?“ అంటూ సెటైర్లు వేశారు. నిజంగానే విజయసాయిరెడ్డి ట్వీట్ చేయకపోవడం గమనార్హం.