విజయనగరం రాజులకు చెందిన మాన్సాస్ ట్రస్టు వ్యవహారం ఇపుడు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. మాన్సాస్ ట్రస్టుకు చెందిన 13వేల ఎకరాల భూములపై కొందరు ప్రభుత్వ పెద్దల కన్నుపడిందని, వాటిని దక్కించుకోవాలన్న ఉద్దేశంతోనే ట్రస్టు చైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తప్పించారని ఆరోపణలు వచ్చాయి. అయితే, తాజాగా కోర్టు తీర్పుతో అశోక్ గజపతి రాజు మళ్లీ పునర్నియమితులు కావడం వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ట్రస్టు లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేందుకు వైసీపీ పెద్దలు సిద్ధమవడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో అశోక్ గజపతి రాజుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అనేక అసత్య ఆరోపణలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. దీంతో, ఈ వ్యవహారం విజయసాయి వర్సెస్ అశోక్ గజపతిరాజుగా మారింది. వీరిద్దరి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చర్చనీయాంశమయ్యాయి.
ట్రస్ట్ చైర్మన్ పదవి వ్యవహారంలో అశోక్ గజపతిరాజు లింగ వివక్ష చూపిస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని, కోర్టులు, జడ్జిలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొనమని చెప్పవని విజయసాయిరెడ్డి అన్నారు. అశోక్ గజపతి రాజుపై ఫోర్జరీ కేసుందంటూ విజయసాయి వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
ఈ నేపథ్యంలో విజయసాయిపై అశోక్ గజపతి రాజు మండిపడ్డారు. మాన్సాస్ ట్రస్టులో దోపిడీదారులకు స్థానం ఉండదని అశోక్ గజపతిరాజు వార్నింగ్ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి వద్ద మాన్సాస్ భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఎవరిచ్చారో చెప్పాలని కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు.
చైర్మన్ హోదాలో ట్రస్టు కార్యాలయంలోని తన చాంబర్‌కు వెళ్లిన అశోక్ గజపతి రాజు… వివిధ రికార్డుల్లోని సంతకాలను పరిశీలించారు. ట్రస్టు కార్యాలయాన్ని విజయనగరం నుంచి విశాఖ జిల్లాకు ఎందుకు తరలించాల్సి వచ్చిందో, ఆ తర్వాత పరిణామాలేమిటో పరిశీలించాలన్నారు.
https://www.youtube.com/watch?v=lTxHoJRPiT4