వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి హవా ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోని తగ్గుతుందా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. ఏపీలో గత కొంతకాలంగా విజయసాయిరెడ్డి స్థానాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి భర్తీ చేశారని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే రెండోసారి రాజ్యసభకు విజయసాయిని పంపేందుకు కూడా జగన్ విముఖత వ్యక్తం చేశారని, కానీ, వైఎస్ భారతి రికమండేషన్ తో విజయసాయి మలిసారి రాజ్యసభకు వెళ్లారని పుకార్లు వినిపిస్తున్నాయి.
గతంలో పార్టీలో నెం.2గా కొనసాగిన విజయసాయిరెడ్డి ఈ మధ్యకాలంలో తన ప్రాభవం కోల్పోయారని పార్టీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా రాజ్యసభలో సైతం విజయసాయికి షాక్ తగిలింది. రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ కు ఎంపికైన విజయసాయిరెడ్డిని అనూహ్యంగా చివరి నిమిషంలో ప్యానెల్ నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది. ఈ ప్రకారం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కర్ నిర్ణయం తీసుకోవడం విజయసాయికి షాకిచ్చింది.
వాస్తవానికి 8 మందితో కూడిన రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ ను ప్రకటించారు. ఆ జాబితాలో విజయసాయిరెడ్డి పేరు కూడా ఉంది. అయితే, తాజాగా ప్రకటించిన రాజ్యసభ ప్యానెల్ సభ్యుల తుది జాబితాలో సాయి రెడ్డి పేరు మినహాయించి మిగిలిన ఏడు పేర్లు చదివారు. అంతేకాదు, ఆ ప్యానెల్ నుంచి విజయసాయిని తొలగించినట్టుగా రాజ్యసభ చైర్మన్ ధన్ కర్ ప్రకటించడం విశేషం. అయితే, విజయ సాయి పేరు ప్రకటించి ఎందుకు తొలగించారు అన్న కారణాలు వెల్లడి కాలేదు.
అయితే, వైసీపీకి, బీజేపీకి మధ్య గ్యాప్ వచ్చిందని టాక్ వస్తున్న నేపథ్యంలోనే విజయ సాయి రెడ్డి ప్రాధాన్యతను తగ్గించేందుకు కేంద్రంలోని పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా రాష్ట్రంలోనూ, ఢిల్లీలోనూ ఒకప్పుడు చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి ఇప్పుడు కేవలం నామమాత్రపు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగడం వైసిపి శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.