విజయ్ దేవరకొండకు హీరోగా కొంచెం ఇమేజ్, మార్కెట్ రాగానే నిర్మాణంలోకి అడుగు పెట్టేశాడు. నోటా సినిమాకు నిర్మాణ భాగస్వామిగా ఉన్న అతను.. ఆ తర్వాత మీకు మాత్రమే చెప్తా అంటూ సొంత బేనర్లో చేసిన సినిమాతో పూర్తి స్థాయి నిర్మాతగా మారాడు. ఐతే ఆ సినిమా రిలీజ్ ముంగిట విజయ్ చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.
తాను సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులన్నీ ఈ సినిమా మీద పెట్టేశానని అతనన్నాడు. తీరా సినిమా చూస్తే విజయ్ మాటలకు, చేతలకు పొంతన లేదని అర్థమైంది. మరీ పరిమిత వనరులతో, చిన్న బడ్జెట్లో సినిమాను లాగించేశారు. కనీస స్థాయిలో కూడా అందులో నిర్మాణ విలువలు కనిపించలేదు. షార్ట్ ఫిలిమ్స్లోనూ మంచి క్వాలిటీ కనిపిస్తున్న ఈ రోజుల్లో విజయ్.. సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ అంత కనీస స్థాయిలో ఉండటం విమర్శల పాలైంది.
ఐతే తర్వాతి సినిమాకు అయినా దేవరకొండ ఫ్యామిలీ జాగ్రత్త పడుతుందేమో అనుకుంటే.. అలాంటిదేమీ జరగలేదు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆనంద్ దేవరకొండ సినిమా పుష్పక విమానంలోనూ ప్రొడక్షన్ వాల్యూస్ అంతంతమాత్రంగా కనిపించాయి. ఈ చిత్రంలో విజయ్ తండ్రితో పాటు ఇంకో ఇద్దరు నిర్మాణ భాగస్వాములు కూడా ఉన్నారు. మరి ముగ్గురు నిర్మాతలు కలిసి చేసిన సినిమాలో ఇంత లో క్వాలిటీ కనిపించడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆనంద్ గత సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ మంచి విజయం సాధించింది.
అతడికి కొంచెం మార్కెట్ వచ్చింది. ఇక విజయ్ బ్రాండ్ ఎలాగూ ఉపయోగపడేదే. అలాంటపుడు ఓ మోస్తరుగా ఖర్చు చేయడానికి అవకాశం ఉంది. కానీ దేవరకొండ ఫ్యామిలీ పిసినారితనం ప్రదర్శించిందని తెరపై సినిమా చూస్తున్నపుడు స్పష్టంగా తెలిసిపోయింది. మరీ పరిమిత లొకేషన్లో, విజువల్ క్వాలిటీ లేకుండా సినిమా తీశారని అర్థమైపోయింది. బయటి నిర్మాత, ఆనంద్కు హిట్ లేని టైంలో తీసిన మిడిల్ క్లాస్ మెలోడీస్లో అంత క్వాలిటీ ఉన్నపుడు.. అతను హిట్ కొట్టాక సొంత ఫ్యామిలీ తీసిన సినిమా ఇలా ఉండటం విడ్డూరమే.