విజయ్ దేవరకొండ మైక్ అందుకున్నాడంటే ఏదో ఒక సంచలనం రేగాల్సిందే. మీడియాలో హోరెత్తిపోయేలా ఏదో ఒక కామెంట్ చేయకుండా అతను స్టేజ్ దిగడు. తాజాగా అతడి కొత్త చిత్రం ‘లైగర్’ ట్రైలర్ లాంచ్ అయింది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్లో భారీ ఎత్తునే చేశారు. ఒక ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఈ రేంజిలో జరగడం అరుదు.
ఈ సందర్భంగా థియేటర్లో అభిమానుల కోలాహలం మధ్య విజయ్ దేవరకొండ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చాడు. ఈ సందర్భంగా అతడి తొలి మాటే వారసత్వ నేపథ్యం నుంచి వచ్చిన హీరోలకు పంచ్ లాగా అనిపించింది. ‘‘మీకు మా నాన్న ఎవరో తెలియదు. మా తాత ఎవరో తెలియదు. నా ఫ్యామిలీ గురించి తెలియదు. నా చివరి సినిమా రిలీజై రెండేళ్లకు పైగానే అయింది. అది కూడా అంత మంచి సినిమా ఏమీ కాదు. సరిగా ఆడలేదు.
అయినా నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు. ట్రైలర్‌కు మీరు ఇచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఏం చెప్పాలో తెలియడం లేదు’’ అని విజయ్ వ్యాఖ్యానించాడు. టాలీవుడ్లో వారసత్వ నేపథ్యం ఉన్న హీరోలదే ఆధిపత్యం కావడం, పెద్ద స్టార్లందరూ ఆ కోవకు చెందిన వారే అయిన నేపథ్యంలో తాను బ్యాగ్రౌండ్ లేకుండా ఒక స్తాయి అందుకున్న విషయాన్ని విజయ్ చెప్పకనే చెప్పినట్లయింది.
ఆ సంగతి పక్కన పెడితే.. ‘లైగర్’ కోసం తాను ఎంత కష్టపడింది కూడా విజయ్ వివరించాడు. అభిమానుల కోసమే తాను ఇలా బాడీ పెంచానని.. మామూలుగా తనకు డ్యాన్సులంటే చిరాకు అయినప్పటికీ అవి కూడా అభిమానుల కోసమే చేశానని.. తన ఫ్యాన్స్ గర్వంగా ఫీలవ్వాలనే ఇంత కష్టపడ్డానని.. ‘లైగర్’ మూవీని వారికే అంకితం చేస్తున్నానని చెప్పాడు విజయ్.
ఆగస్టు 25న థియేటర్లన్నీ నిండిపోవలని.. ఆ రోజు ఇండియా షేక్ అవుతుందని విజయ్ వ్యాఖ్యానించాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’ సినిమాను అతడి సొంత సంస్థతో పాటు కరణ్ జోహార్ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ రోజు సాయంత్రం ముంబయిలో ‘లైగర్’ హిందీ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు.