జగన్ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట మసకబారిందని పలు హిందూ సంఘాలు, భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. టీటీడీ ఈవో ధర్మారెడ్డి మొదలు టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వరకు టీటీడీ పేరు ప్రతిష్టలను దిగజార్చారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే శ్రీవాణి ట్రస్ట్ తో పాటు టీటీడీకి చెందిన పలు వ్యవహారాల్లో అవకవతకలు జరిగాయని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసిపి పాలనలో టీటీడీ లో జరిగిన అక్రమాలపై గత రెండు నెలలుగా విజిలెన్స్ విచారణ జరుగుతోంది.
నిబంధనలను అతిక్రమించి చేసిన ఖర్చులు, పనులపై అధికారులు సమాచారాన్ని సేకరించారు. ఈ క్రమంలోనే తాజాగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిచ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి లకు విజిలెన్స్ అధికారులు నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది. గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారని తెలుస్తోంది.
వారి నుంచి అధికారులు వివరణ కోరినట్టుగా తెలుస్తోంది. మామూలుగా అయితే ప్రతి ఏటా 300 కోట్ల రూపాయల వరకు ఇంజనీరింగ్ పనులను టీటీడీ పరిధిలో కేటాయిస్తుంటారుజ అయితే, ఆ టెండర్ల క్రమంలో భారీగా ముడుపులు చేతులు మారాయని ఆరోపణలు వచ్చాయి. గోవిందరాజ స్వామి సత్రాలకు 420 కోట్లు, స్విమ్స్ కు 77 కోట్లు, మిగతా రోడ్లు పనుల కేటాయింపులపై విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారని తెలుస్తోంది. టీటీడీలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నా అడ్డుకోని అధికారి బాలాజీకి నోటీసులు ఇచ్చి వివరణ కోరుకున్నట్టుగా తెలుస్తోంది.