తప్పులు చేసినోళ్లు ఏ స్థాయికి చెందిన వారైనా సరే.. కఠినశిక్షలు అమలు చేస్తే.. మిగిలిన వారికి భయం కలుగుతుంది. తప్పు చేయాలన్న ఆలోచనను మొగ్గ స్థాయిలోనే తుంచేస్తారు. అలాంటి తీరును తాజాగా వియత్నాంలో ప్రదర్శించారు. అక్కడి న్యాయస్థానం తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగానూ సంచలనంగా మారింది. వియత్నాంకు చెందిన దిగ్గజ మహిళా రియల్టర్ కు మరణశిక్షను విధిస్తూ అక్కడి న్యాయస్థానం తీర్పును ఇచ్చింది.
బ్యాంకింగ్ రంగంలోనే అతి పెద్ద స్కాంగా అభివర్ణిస్తున్న ఉదంతంలో అందులో కీలకపాత్ర పోషించిన మహిళా రియల్టర్ కు మరణశిక్ష విధించటం గమనార్హం. కమ్యునిస్టుల ఏలుబడిలో ఉన్న వియత్నాంలో ప్రముఖ వ్యాపారవేత్త, 67 ఏల్ల ట్రూంగ్ మైలాన్ తప్పడు పనులకు కారణమయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా ఆమెపై మోపిన ఆరోపణలు నిజమని తేలటం.. ఆమె తప్పునకు బదులుగా మరణశిక్ష విధిస్తూ అక్కడి న్యాయస్థానం సంచలన తీర్పును ఇచ్చింది.
సదరు మహిళా రియల్టర్ మీద మోపిన ఆరోపణల ప్రకారం ఆమె రూ.3.6 లక్షల కోట్ల మేర స్కాంకు పాల్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. వియత్నాంలోని సైగాన్ కమర్షియల్ బ్యాంకు నుంచి పదకొండేళ్ల వ్యవధిలో ఆమె దాదాపు రూ.3.68 లక్షల కోట్ల భారీ మొత్తాన్ని రుణంగా తీసుకున్నారు. ఇందులో రూ.2.25 లక్షల మొత్తాన్ని ఆమె నుంచి రికవరీ చేయలేమని ప్రాసిక్యూటర్లు కోర్టును తెలిపారు.
ఇంతకూ ఈ స్కాం ఎలా చేశారన్న విషయానికి వెళితే.. 2011లో వియత్నాంలో బడా రియల్టర్ గా ఎదిగిన ట్రూంగ్ మైలాన్.. దేశంలో నగదు కొరత ఉన్న మూడు బ్యాంకులను ఒక పెద్ద సంస్థగా విలీనం చేసేందుకు వీలుగా అనుమతులు పొదారు. అయితే.. అక్కడి నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఏ బ్యాంకులో అయినా 5 శాతం కంటే ఎక్కువ వాటాలు ఉండకూడదు. ఈ పరిమితిని అధిగమించేందుకు ఆమె వందలాది షెల్ కంపెనీలు.. బినామీలను స్రష్టించిన ఆమె.. విలీనం చేసిన బ్యాంకులో 90 శాతం వాటాను తప్పుడు మార్గంలో సొంతం చేసుకున్నారు.
తన సొంత మనుషుల్ని బ్యాంకులోని కీలక స్థానాల్లో నియమించుకున్నారు. అక్కడితో ఆగని ఆమె సదరు షెల్ కంపెనీలకు రుణాలు మంజూరయ్యేలా చేసుకున్న ఆమె.. సదరు బ్యాంకు జారీ చేసిన రుణాల్లో 93 శాతం రుణాల్ని ఆమే తీసుకోవటం గమనార్హం. చివరకు తన డ్రైవర్ తో బ్యాంకు నుంచి రూ.33వేల కోట్లు విత్ డ్రా చేయించి సీక్రెట్ ప్లేస్ కు తరలించిన సత్తా ఆమె సొంతం. ఇంతటి తప్పుడు మార్గాల బాట పట్టిన ఆమెకు మరణశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
2022లో ఈ స్కాం వెలుగు చూసింది. అప్పట్లో ఆ దేశాన్ని ఈ కుంభకోణం కుదిపేసింది. ఈ కేసులో ట్రూంగ్ మైలాన్ తో సహా మొత్తం 85 మందిని దర్యాప్తు సంస్థలు అప్పట్లో అరెస్టుచేశాయి. ఇందుతో సదరు బ్యాంకు అత్యున్నతస్థాయి అధికారులతో పాటు.. టాప్ లేయర్ కు చెందిన వారున్నారు. ఈ ఉదంతంపై విచారణ జరిపిన న్యాయస్థానం మైలాన్ ను దోషిగా తేల్చింది. ఆమెతో పాటు మిగిలిన నిందితులకు శిక్షలు ఖరారు చేసింది.