టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. యావత్ తెలుగు సినీ లోకాన్ని విషాదంలో ముంచేసి కళా తపస్వి కె.విశ్వనాథ్, ప్రముఖ దర్శక నిర్మాత సాగర్ తిరిగిరాని రోగాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి చిత్ర పరిశ్రమ, తెలుగు సినీ ప్రేక్షకులు కోలుకోక ముందే తాజాగా టాలీవుడ్ లో ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం కన్నుమూశారు. శనివారం ఉదయం చెన్నైలోని తన ఇంట్లో వాణీ జయరాం తుదిశ్వాస విడిచారని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాణీ జయరాం ఈరోజు కన్నుమూశారని వారు తెలిపారు. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న వాణీ జయరాం జన్మించారు. వాణీ జయరాం అసలు పేరు కళైవాణి. కాగా, సినిమాల్లోకి వచ్చిన తర్వాత వాణీ జయరాంగా పేరు మార్చుకున్నారు. కర్ణాటక సంగీతం నేర్చుకున్న వాణీ జయరాం తన 8వ ఏట సంగీత కచ్చేరి నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు.
తెలుగుతోపాటు దాదాపు 14 భారతీయ భాషలలో 20 వేలకు పైగా పాటలు పాడిన ఘనత వాణీ జయరాం సొంతం. కె.వి మహదేవన్, ఎం.ఎస్ విశ్వనాథన్, ఇళయరాజా, పెండ్యాల, చక్రవర్తి, సాలూరు రాజేశ్వరరావుల సంగీత దర్శకత్వంలో వాణీ జయరాం ఎక్కువ పాటలు పాడారు. సంగీత రంగానికి, సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలకు గాను పద్మ భూషణ్ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం ఆమెను సన్మానించింది. దీంతోపాటు, 3 జాతీయ పురస్కారాలు కూడా వాణీ జయరాం అందుకున్నారు. వాణీ జయరాం మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు, గాయకులు, సంగీత దర్శకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఆర్ వి గురుపాదం శనివారం నాడు కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో ఈరోజు ఉదయం ఆయన హఠాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. తెలుగులో వయ్యారి భామలు వగలమారి భర్తలు, పులి బొబ్బిలి చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. తెలుగుతోపాటు కన్నడ హిందీ తమిళం భాషల్లో 25 చిత్రాలను నిర్మించారు. బాలీవుడ్ లో శ్రీదేవి హీరోయిన్ గా అఖల్ మంద్ సినిమాకు ఆయన నిర్మాతకు వ్యవహరించారు.