ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గురజాల నియోజకవర్గం అంటేనే.. గుంటూరు కారానికి ప్రతీక. ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే సాగుతుంటాయి. నాయకులు ఎవరున్నా.. పార్టీలు ఏవైనా.. రాజకీయాలు మాత్రం సలసల మరుగుతూనే ఉంటాయి. ఇక, ఇప్పుడు కీలకమైన ఎన్నికల సమయం కావడంతో గురజాల ఇప్పుడు మరింత గరం-గరంగా మారిపోయింది. సవాళ్లు-ప్రతిసవాళ్లు, మేనిఫెస్టోలు.. సొంత మేనిఫెస్టోలతో రాజకీయం కాకరేపుతోంది.
టీడీపీ నుంచి సీనియర్ నాయకుడు యరపతినేని శ్రీనివాసరావు గురజాల నియోజకవర్గంలో పోటీ చేస్తు న్నారు. ఈసారి యరపతినేని గెలుపు పక్కా అనే సమాచారం అందుతోంది. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న కాసు మహే ష్రెడ్డి(సిట్టింగ్ ఎమ్మెల్యే) అందరినీ దూరం చేసుకోవడం.. అందరికీ దూరం కావడంతో ఆయన విజయం దక్కించుకోవడం కష్టమనే వాదన వినిపిస్తోంది. ఎంత బద్ధ శత్రువైనా.. ఎన్నికల సమయంలో ఏకం కావాలని కోరుకుంటారు..కానీ.. కాసు మాత్రం అందరినీ దూరం చేసుకున్నారు.
ఇక, ఇద్దరు నాయకులు పోటీ చేస్తున్న బలమైన పార్టీలు మేనిఫెస్టోల రూపకల్పనలో ముందున్నాయి. అయితే.. ఇది చాలదని భావించిన యరపతినేని ముందుగానే.. తన సొంత అజెండాతో స్థానికంగా 6 హామీ లు ఇస్తూ.. ప్రత్యేకంగా మేనిఫెస్టో ఇచ్చారు. ప్రతి ఇంటికీ ఒక సిలెండరు ఫ్రీతోపాటు.. పలు హామీలు ఇచ్చారు. దీనికి ప్రతిగా కాసు మహేష్ కూడా.. సొంత మేనిఫెస్టో తయారు చేసుకున్నారు. అంటే.. ప్రత్య ర్థిని చూసి ఐడియాను కాపీ కొట్టారన్న మాట. ఇద్దరూ దీనిపైనా సవాళ్లు రువ్వుకున్నారు.
ఇక, ఈ మేనిఫెస్టో రగడ వ్యక్తిగత దూషణలకు కూడా దారి తీసింది. ఈ క్రమంలోనే యరపతినేని.. కాసుకు అదిరిపోయే సవాల్ రువ్వారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే.. రాజకీయ సన్యాసం తీసుకునేందుకు నువ్వు సిద్ధమేనా? అని యరపతినేని ప్రశ్నించారు. దీనికి ఆయన గంట సమయం ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. అయితే.. దీనిపై స్పందించిన కాసు.. 2019లో నే తానుచిత్తు చిత్తుగా ఓడిస్తానని అంటున్నారు. మొత్తంగా నోటిఫికేషన్ రాకముందే.. గురజాల్ హీటెక్కడంతో.. ఎన్నికల సమయానికి ఈ నియోజకవర్గంలో వాతావరణం మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.