దేశవ్యాప్తంగా కాంగ్రెస్ హవా నడుస్తోన్న సమయంలో……ప్రాంతీయ పార్టీల ఉనికి పెద్దగా లేని రోజుల్లో…విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు….కాంగ్రెస్ కు వ్యతిరేకంగా `తెలుగు` దేశం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. `తెలుగు` వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు పుట్టిన పార్టీ అంటూ వెండితెర `రాముడు` నందమూరి తారక రామారావు ప్రచారం చేయడంతో ఆనాడు టీడీపీకి ప్రజలు నీరాజనాలు పలికారు.
ఇటు సినీరంగంలోనూ, అటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసిన అన్నగారికి ప్రజలు తమ గుండెల్లో గుడి కట్టారు. తెలుగు నాట ఎన్టీఆర్ రాజకీ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తి దాయకం అన్నది నిర్వివాదాంశం. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంపై పాత్రికేయుడు రమేశ్ కందుల ‘మేవరిక్ మెస్సయ్య: ఏ పొలిటికల్ బయోగ్రఫీ ఆఫ్ ఎన్టీ రామారావు’ అనే పుస్తకాన్ని రచించారు. తాజాగా, ఆ పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ పై వెంకయ్య నాయుడు ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ రాజకీయజీవితం శోభాయమానం అని, తన రాజకీయ జీవితంలో ఎన్టీఆర్ లెజెండ్ గా జీవించారని వెంకయ్యనాయుడు కొనియాడారు. జాతీయస్థాయిలో ప్రతిపక్షాలను బలోపేతం చేసిన ఘనత ఎన్టీఆర్ దేనని ప్రశంసించారు. రాజకీయ సంస్కృతినే ఎన్టీఆర్ పునర్ నిర్వచించారని, ఎన్టీఆర్ రంగప్రవేశంతో రాజకీయాల రూపురేఖలు మారాయని వెంకయ్య నాయుడు పొగిడారు.
ఎన్టీఆర్ కు చరిత్ర తగిన న్యాయం చేయలేదని, ‘మావెరిక్ మెస్సయ్య…’ వంటి పుస్తకాలు మరిన్ని రావాలని, ఎన్టీఆర్ జీవితంలోని అనేక కోణాలు వెలుగులోకి రావాలని ఆకాంక్షించారు.ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, ప్రముఖ రచయిత, రాజకీయ విశ్లేషకుడు సంజయ్ బారు హాజరయ్యారు.