మాజీ ఉప రాష్ట్రపతి, మాజీ కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు పరోక్ష ప్రచారం ప్రారంభించారా? వర్చువల్గా ఇక నుంచి ఆయన ప్రచారం చేయనున్నారా? అంటే.. తాజా పరిణామాలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా వెంకయ్యనాయుడు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. బూతులు మాట్లాడే నాయకులను ఎన్నికల్లో ఓడించాలని అన్నారు వారి వల్ల రాష్ట్ర పరువు గంగలో కలుస్తోందని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారిని ఓటుతోనే ఎదుర్కొనాలని పిలుపునిచ్చారు.
`వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటేయాలి. ఎవరూ తొందర పాటు నిర్ణయం తీసుకోవద్దు. అభివృద్ది చేస్తారని మీరు ఎవరిని భావిస్తారో వారికి ఓటేయాలి. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో రాజకీయాలను కలుషితం చేస్తూ.. బూతులు మాట్లాడుతున్నవారిని భౌతికంగా ఎదుర్కొనడం సాధ్యంకాదు. అందుకే.. ఇలాంటి వారిని ఓటుతోనే అరికట్టాలి. ఇది నా విజ్ఞప్తి అని వ్యాఖ్యానించారు.` అయితే.. ఈయన ఎవరిని ఉద్దేశించిందీ నేరుగా అయితే చెప్పలేదు.
కానీ, వైసీపీ నాయకుల గురించే వెంకయ్యనాయుడు ఇలా వ్యాఖ్యలు చేసి ఉంటారని.. పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అదేసమయంలో బీజేపీ గురించి కూడా ఆయన మాట్లాడితే బాగుండేదని అనేవారు కూడా ఉన్నారు. ఇక, బీజేపీతో పొత్తు కోసం టీడీపీప్రయత్నాలు చేస్తున్న దరిమిలా.. ఈ సారి ఏమైనా వెంకయ్య తెరవెనుక చక్రం తిప్పుతారా? అనే చర్చ కూడా సాగుతోంది. 2014లో బీజేపీ .. టీడీపీతో పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తు వెనుక తానే ఉన్నానని.. తర్వాత.. వెంకయ్య చెప్పుకొచ్చారు.
అప్పట్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న ఫలితంగా.. బీజేపీ నాలుగు ఎమ్మెల్యే, రెండు ఎమ్మెల్సీ, ఒక ఎంపీ సీటును దక్కించుకుని.. చక్రం తిప్పింది. అంతేకాదు..చంద్రబాబు మంత్రివర్గంలోనూ ఇద్దరు మంత్రులు ఉండేవారు ఇలా.. పార్టీ ఒక రకంగా పుంజుకుంది. 2019కివచ్చేస రికి.. వెంకయ్య జాతీయ రాజకీయాల నుంచి తప్పుకొని ఉపరాష్ట్రపతి అయ్యారు. దీంతో ఆయన జోక్యం చేసుకోలేదు. ఇక, ఇప్పుడు టీడీపీ బీజేపీతో జట్టు కోసంప్రయత్నం చేస్తున్న దరిమిలా.. ఆయన జోక్యం చేసుకుంటే బాగుంటుందనే వాదన వినిపిస్తోంది.