ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేన వార్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. జగన్ పై నాగబాబు వంటి జనసేన నేతలు విమర్శలు గుప్పిస్తుండడం, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం చర్చనీయాంశమైంది. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పార్ట్ టైం పొలిటిషియన్ అంటూ వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ , మెగా బ్రదర్ నాగబాబులపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరారని వెల్లంపల్లి షాకింగ్ కామెంట్లు చేశారు. చిరంజీవి లేకుంటే పవన్ కల్యాణ్ ఎవరో ఎవరికీ తెలిసేది కాదని అన్నారు. మెగాస్టార్ లేకపోతే పవర్ స్టార్ ఎక్కడి నుంచి వచ్చేవాడని వెల్లంపల్లి ప్రశ్నించారు. ఇక, మెగా బ్రదర్ నాగబాబుకు ఒక విధి, విధానం అంటూ లేవని వెల్లంపల్లి విమర్శించారు. అంతేకాదు, చిరంజీవి అభిమానులను నాగబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
జనసేనకు చిరంజీవి ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేయాలని నాగబాబు అనడం విడ్డూరంగా ఉందని వెల్లంపల్లి ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు కూడా పవన్ ఎలాంటి వాడో తెలుసని వెల్లంపల్లి అన్నారు. ప్యాకేజీ స్టార్ గా పేరున్న పవన్…బీజేపీతో టచ్ లో ఉన్నప్పటికీ…పవన్ ను బీజేపీ వాళ్లు అస్సలు పట్టించుకోవడం లేదని వెల్లంపల్లి విమర్శించారు.
కాగా, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు వింటే.. 2024లో ఆయననే ముఖ్యమంత్రిగా చూడొచ్చని నాగబాబు ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పవన్ ఎక్కడికెళ్తే అక్కడ సమస్యలు తీరుతాయన్న నమ్మకం ఏర్పడిందని, ఉత్తరాంధ్రలో సమస్య వస్తే పవన్ అవసరం లేదని, జన సైనికులు వస్తే చాలనేంతలా నమ్మకం ఏర్పడిందని అన్నారు. జనసేనకు తానేం చేస్తున్నాననేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, పవన్ నిప్పుల్లో దూకమంటే దూకాలని.. అలాంటి కార్యకర్తలు అవసరమని అన్నారు.