ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక ఉత్తర్వు జారీ చేసింది. దీని ప్రకారం నటసింహం బాలయ్య సినిమా టికెట్ ధర పెంపును రూ.20గా నిర్ణయించింది. ప్రస్తుతం ఈ పరిణామం.. బాలయ్య అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని పెంచుతోంది. విషయం ఏంటంటే.. సంక్రాంతి బరిలో బాలయ్య సినిమా వీరసింహారెడ్డి పోటీ పడనుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ కూడా ఇప్పటికే నిర్మాతలు, హీరో బాలయ్య కూడా జోరుగా చేస్తున్నారు.
అయితే.. కొత్త సినిమా కావడం.. హై బడ్జెట్ మూవీ కావడంతో ఈ సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని.. ప్రభుత్వానికి విన్నవించారు మూవీ మేకర్స్. ఈ క్రమంలో వారు ఇచ్చిన దరఖాస్తు ఆధారంగా ప్రభుత్వం.. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను రిఫర్ చేసింది. ఈ సినిమాకు టికెట్ ధరలను ఎంత పెంచాలనే విషయాన్ని పరిశీలించాలని కోరింది.
ఈ క్రమంలో సినిమా పెట్టుబడి.. హీరో వాల్యూ, థియేటర్లు.. వంటి విషయాలను పరిగణనలోకి తీసుకున్న కార్పొరేషన్.. సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతించాలని.. ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇక, అటు మూవీ మేకర్స్ అభ్యర్థన, ఇటు కార్పొరేషన్ సిఫారసులను పరిశీలించిన ప్రభుత్వం.. వెంటనే తగు నిర్ణయం తీసుకుంది.
దీని ప్రకారం.. మల్టీ ప్లెక్సులు.. సాధారణ ధియేటర్ల నుంచి అన్ని థియేటర్ల వరకు ఒక్కొక్క టికెట్‌పై రూ.20 చొప్పున పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. వాస్తవానికి సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలకు గరిష్ఠంగా ఆయా థియేటర్ల స్థాయిని బట్టి.. రూ.150 నుంచి 100 వరకు పెంచుకునే అవకాశం ఉండేది. అయితే.. ఏపీ ప్రభుత్వం మాత్రం తాజాగా దీనిని రూ.20గా నిర్ణయించడంతో బాలయ్య అభిమానులు మండిపడుతున్నారు.