ఒక ప్రముఖ హీరో కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వటం సినిమా ఇండస్ట్రీలో కామన్. అందుకు భిన్నంగా నిలుస్తారు ప్రముఖ నటుడు మాధవన్ కొడుకు వేదాంత్ మాధవన్. స్విమ్మింగ్ పోటీల్లో ఇప్పటికే తన సత్తా చాటి.. అంతర్జాతీయంగా మెడళ్లు సాధించిన అతగాడు.. తాజాగా మలేషియాలో జరిగిన పోటీల్లో ఏకంగా ఐదు మెడళ్లను సొంతం చేసుకున్నాడు. దీంతో తన కొడుకు సాధించిన విజయాలపై మాధవన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇన్ స్టాలో ఫోటోల్ని షేర్ చేసి తన హ్యాపీ మూడ్ ను అందరికి షేర్ చేశారు.
మలేషియన్ ఇన్విటేషనల్ ఏజ్ గ్రూప్ చాంఫియన్ షిప్స్ లో పాల్గొన్న వేదాంత్.. ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ పోటీల్లో ఐదు స్వర్ణాలు సాధించాడు. 50 మీటర్లు.. 100 మీటర్లు.. 200 మీటర్లు.. 400 మీటర్లు..1500 మీటర్లకు సంబంధించిన పోటీల్లో అన్నింటిలోనే అగ్రస్థానంలో నిలిచి.. ఐదు స్వర్ణ పతకాల్ని సాధించటం ద్వారా అందరి చూపు తన మీద పడేలా చేశాడు. తన కొడుకు విజయాల మీద స్పందించిన మాధవన్.. దేవుడి దయ.. మీ అందరి ఆశీస్సులతో వేదాంత్ విజయం సాధించాడన్నారు.
వేదాంత్ ను చూస్తుంటే తనకు చాలా సంతోషంగా.. గర్వంగా ఉందన్న మాధవన్.. తనకు సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలియజేశాడు. ఇప్పటికే పలు జాతీయ అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొన్న వేదాంత్ తన సత్తా చాటి.. పోటీల్లో పాల్గొన్న ప్రతిసారీ పతకాల్ని సొంతం చేసుకుంటున్నాడు. గత ఏడాది జులైలో జరిగిన 48వ జూనియర్ నేషనల్ అక్వాటిక్ చాంఫియన్ షిప్ లో 1500 మీటర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ పోటీల్లో జాతీయ రికార్డును బద్ధలు కొట్టాడు. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి.. ఒలింపిక్స్ లో భారత్ తరఫున పతకం సాధించాలని ఆశిద్దాం.