అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని నగరమైన శాక్రమెంటో లో హారిస్ సెంటర్ థియేటర్లో ఆగస్టు 18, 2024 న ప్రవాసాంధ్ర చిరంజీవి. వర్షిణి నాగం భరతనాట్య రంగప్రవేశం కార్యక్రమం వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి బాల్యం నుంచే నాట్యంపై ఆసక్తి కలిగిన చిరంజీవి. వర్షిణి కి 6వ ఏట నుంచే ఆమె తల్లిదండ్రులు భరతనాట్య శిక్షణ ఇప్పించారు.
గురువు శ్రీమతి. హేమ సత్యనారాయణన్ శిక్షణలో తన 16వ ఏట చిరంజీవి. వర్షిణి భరతనాట్య రంగప్రవేశం కార్యక్రమంకు ఉపక్రమించింది.
ప్రాచీన నాట్య కళలకు అంతంత మాత్రంగా ప్రోత్సాహం ఉన్న ఈ రోజుల్లో, ఈ తెలుగు తేజం భరతనాట్యం ప్రదర్శించిన తీరు ఆద్యంతం అలరించింది.
తన హావభావాలతో, నాట్య భంగిమలతో వర్షిణి దాదాపు మూడు గంటలపాటు ప్రేక్షకులను మంత్ర ముగ్గులను చేసింది.
ఈ సందర్భంగా వేదికపై పలువురు ఆత్మీయ అతిధులు: ఫాల్సం నగర కౌన్సిలర్ శ్రీ చలంచర్ల ఏడుకొండలు మాట్లాడుతూ భారత సాంప్రదాయంలో భాగమైన నాట్యం వారసత్వాన్ని కొనసాగించడం యువతకు అత్యంత అవసరమని చెప్పారు.
రాంచో కార్డోవా నగర ప్రణాళికా కమీషనర్ శ్రీ సురేందర్ దేవరపల్లి నాట్యం వల్ల జీవితంతో సమతుల్యం ఏర్పడుతుందని, భావోద్వేగాలను మరింత మెరుగ్గా సమన్వయము చేసుకునే శక్తి భరతనాట్యం వల్ల పొందవచ్చునని వారు తెలిపారు.
సువిధా ఇంటర్నేషనల్ సంస్థ వ్యవస్థాపకుడు భాస్కర్ వెంపటి మాట్లాడుతూ ఈ తరం యువతకు ఏదో ఒక కళలో ప్రవేశం ఉండాలనన్నారు.
అది వారి వ్యక్తిత్వంలో నిర్ణయాత్మకమైన మంచి మార్పులకు కారణమవుతుందని వారు చెప్పారు.
ఈ సందర్భంగా భరతనాట్యం రంగప్రవేశం గావించిన చిరంజీవి. వర్షిణి నాగం ను అభినందిస్తూ వారు ఆమెకు ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు.
కాలిఫోర్నియా రాష్ట్ర స్థానిక శాసనసభ్యుడు జాష్ హూవర్, మరియూ అమెరికా జాతీయ కాంగ్రెస్ చట్ట సభ సభ్యుడు కెవిన్ కైలీ కార్యాలయం నుండి వర్షిణి నాగం కు ప్రశంసా పత్రం ను ప్రదానం చేశారు.
చిరంజీవి. వర్షిణి నాగం భరతనాట్య రంగప్రవేశం సందర్భంగా ఆమెను అభినందిస్తూ అలాగే “సిలికానాంధ్ర సంపద” కార్యక్రమంలో జూనియర్ సర్టిఫికెట్ సాధించిన ఆమెను ప్రశంసిస్తూ సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు, మరియూ చైర్మన్ శ్రీ ఆనంద్ కూచిభోట్ల గారు విడుదల అభినందనాపత్రాన్ని “సంపద” అనుసంధానకర్త శ్రీమతి శాంతి కొండా తరపున నిర్వాహకులు వర్షిణి కి అందజేశారు.
ఈ కార్యక్రమంతో స్థానిక కళాశ్రేయ నృత్య పాఠశాల ఆధ్వర్యంలో ప్రముఖ గురువు శ్రీమతి. హేమ సత్యనారాయణన్ పది రంగప్రవేశాలు పూర్తిచేసినందున ఆమెను అభినందిస్తూ నిర్వాహకులు వేదికపై ఆహుతుల, ఆమె కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమెను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా గురువు శ్రీమతి. హేమ భరతనాట్య శిక్షణా నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ ఫాల్సం నగర కౌన్సిలర్ శ్రీ చలంచర్ల ఏడుకొండలు, కాలిఫోర్నియా రాష్ట్ర స్థానిక శాసనసభ్యుడు జాష్ హూవర్, మరియూ అమెరికా జాతీయ కాంగ్రెస్ చట్ట సభ సభ్యుడు కెవిన్ కైలీ కార్యాలయం నుండి విడుదల అయిన ప్రశంసా పత్రాలను ఆమెకు వేదికపై ఆహుతుల హర్షధ్వానాల మధ్య ప్రదానం చేశారు.
అంతకు మునుపు స్థానిక హారిస్ సెంటర్ థియేటర్లో వైవిద్యభరితమైన భరత నాట్యాంశాలను జనరంజకంగా ప్రదర్శించి చిరంజీవి. వర్షిణి ప్రేక్షకులకు కనువిందు చేసింది.
స్థానిక కళాశ్రేయ నృత్య పాఠశాల ఆధ్వర్యంలో ప్రముఖ గురువు శ్రీమతి. హేమ సత్యనారాయణన్ శిష్యురాలైన చిరంజీవి. వర్షిణి భరతనాట్యంలో రంగప్రవేశం ప్రదర్శన చేసింది.
పుష్పాంజలి, అలరిప్పు, జతిస్వరం, వర్ణం, శివస్తుతి, తిల్లానా అంశాల్లో నర్తించి ఆమె భళా అనిపించింది.
ఈ కార్యక్రమంకు ఐదు వందలకు పైగా స్థానిక శాక్రమెంటో ప్రవాసాంధ్రులు, మిత్రులు హాజరై చిరంజీవి. వర్షిణి ని అభినందించారు.
విశ్రుత్ నాగం ఆలపించిన వినాయకుడి ప్రార్ధనాగీతంతో కార్యక్రమం ప్రారంభం అయింది.
వర్షిణి తల్లిదండ్రులు వాణి – వెంకట్ నాగం ఆధ్యర్యంలో ఆత్మీయ అతిధులకు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం గురు శ్రీమతి. హేమ సత్యనారాయణన్ కు సత్కారం చేశారు.
చిరంజీవి. వర్షిణి నాగం సోదరుడు చిరంజీవి. విశ్రుత్ నాగం ఈ సందర్భంగా వేదికపై ఏకదంతాయ వక్రతుండాయ, ఆనందామృతకర్షిణి, అన్నమయ్య కీర్తన “శ్రీమన్నారాయణ” మూడింటినీ భావయుక్తంగా ఆలపించాడు.
చిరంజీవి. విశ్రుత్ నాగం 15 ఏండ్ల వయస్సులో 2018లో విజయవాడలో కర్ణాటక సంగీతంలో రంగప్రవేశం చేసిన విషయాన్ని ఆహుతులు గుర్తుచేసుకున్నారు.
ఒకే ప్రవాసాంధ్ర కుటుంబం నుండి ఇద్దరు పిల్లలు వేర్వేరు విభాగాలలో ఆరు ఏండ్ల సమయంలో రంగప్రవేశం చేయడం అరుదైన విషయమని, ఈ స్పూర్తితో ప్రవాసాంధ్రులు తమ పిల్లలకు సాంప్రదాయ భారతీయ కళలను పరిచయం చేయాలని, అప్పుడే ఘనత వహించిన భారతీయ కళా సాంప్రదాయం దేశం దాటి విదేశాలలో కూడా విరాజిల్లుతుంది అని పలువురు ఆహుతులు సూచించారు.
ఈ భరతనాట్యం రంగప్రవేశం ప్రదర్శనకు శ్రీ సాయి రాతిన సభాపతి గాత్రం, శ్రీ గజేంద్రన్ గణేశన్ మృదంగం, శ్రీ రాధాకృష్ణన్ సెల్వప్రసాద్ వయోలిన్, శ్రీ కడప రాఘవేంద్రన్ వేణువు, చిరంజీవి. విశాల్ వెంకటేశ్వరన్ కంజీర వాద్య సహకారం అందించారు.
చిరంజీవి. వర్షిణి నాగం మాట్లాడుతూ తనకు ప్రేమతో భరతనాట్యం విద్యను నేర్పించిన గురు శ్రీమతి. హేమ సత్యనారాయణన్ కు ధన్యవాదాలు తెలియజేసింది.
తన తల్లిదండ్రులకు, సోదరునికి, ఆత్మీయ అతిధులకు, భరతనాట్యం రంగప్రవేశం ప్రదర్శన ఆసాంతం తిలకించిన వీక్షకులకు, సహకారం అందించిన వాద్య బృందానికి వినమ్ర పూర్వకమైన కృతజ్ణతలు తెలియజేసుకుంటున్నాను అని చిరంజీవి. వర్షిణి చెప్పింది.
ఈ సందర్భంగా హారిస్ సెంటర్ థియేటర్ లాబీలో ప్రదర్శనకు ఉంచిన భరతనాట్య ఔన్నత్యాన్ని తెలిపే పలు కళాఖండాలు, చిత్రాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
స్థానిక ఫాల్సం రుచి రెస్టారెంట్ వారు వండిన పసందైన తెలుగు భోజనంతో భరతనాట్యం రంగప్రవేశం కార్యక్రమం విజయవంతంగా పూర్తిఅయింది.
ReplyReply allForward |