వైసీపీ నాయకులు ఒకవైపు టికెట్ల బెంగతో గుండెలు చిక్కబట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో తెలియక అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా వారికి వైసీపీ అధినేత నుంచి పెద్ద కబురు వచ్చింది. తాజాగా రామ్గోపాల్ వర్మ రూపొందించిన `వ్యూహం` సినిమాను మీమీ నియోజకవర్గా ల్లో ఉచితంగా ప్రదర్శించాలన్నది దారి సారాంశం. ఉచితం అంటే.. టికెట్లు మాత్రమే ఉచితం.. ధియేటర్లకు అద్దెలు చెల్లించడమో.. టికెట్లలో షేర్లు చెల్లించడమో చేయాలి. ఇది కూడా లక్షల్లోనే ఉండనుంది. దీంతో నాయకులు అల్లాడి పోతున్నారు.
రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా విడుదలైంది. పూర్తి స్థాయిలో సెటైరిక్ గా తెరకెక్కిన `వ్యూహం` టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది. అయితే, ఆ స్థాయిలో జనాల్ని థియేటర్లకు రప్పించలేకపోయిందనే వాదన ఉంది. అయితే ఈ వ్యూహంతో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలకు పెద్ద చిక్కొచ్చి పడింది. సినిమాని వారి వారి ప్రాంతాల్లో ఉచితంగా ప్రదర్శించాల్సిందేనని, ప్రజలను ధియేటర్లకు రప్పించి చూపించాల్సిందేనని పార్టీ అధిష్టానం క్షేత్రస్థాయి నాయకులకు తేల్చి చెప్పింది. దీంతో నాయకులు ఇప్పుడు ఊరారా వాట్సాప్ గ్రూపుల్లో ఉచిత ప్రదర్శనపై ప్రచారం చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఓ థియేటర్లో వ్యూహం సినిమాని ఉచితంగా ప్రదర్శించారు. స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఉచిత ప్రదర్శన జరగడం విశేషం. ఈ సినిమా ఉచిత ప్రదర్శనకు తానే రిబ్బన్ కటింగ్ చేయబోతున్నారు. ఈ ఉచిత ప్రదర్శనకు ఎమ్మెల్యే హాజరవుతున్నారంటూ ఆయన కార్యాలయం నుంచే ప్రకటన విడుదల కావడం విశేషం. ఎమ్మెల్యేనే నేరుగా వస్తున్నారంటే ఇక సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ రావడం ఖాయం. అది కూడా ఉచితంగానే.
ఈ ఉచిత సినిమా వ్యవహారంపై టీడీపీ నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే ఇలా ఉచిత సినిమాలు ప్రదర్శించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఉచిత ప్రదర్శనకు పరిమితమైతే పర్లేదు, తానే స్వయంగా వచ్చి ఆ ప్రదర్శనకు పబ్లిసిటీ చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు. సినిమా ఫ్లాప్ కావడం వల్లే ఇలా వైసీపీ ఎమ్మెల్యేలు హైప్ తేవాలని చూస్తున్నారని కౌంటర్లిస్తున్నారు.