తెలుగు సినీరంగ రారాజు.. రెబల్ స్టార్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ ఆద్యంతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ముఖ్య హీరోలు.. నటులు , క్యారెక్టర్ ఆర్టిస్టులు.. అలనాటి హీరోయిన్లు అందరూ కూడా రాజుగారి భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కట్ చేస్తే.. వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. ఈ విషయంలోనూ.. వేలు పెట్టారు. హాట్ కామెంట్లతో సెగ పుట్టించారు.
కృష్ణంరాజు మృతి పట్ల సంతాప సూచకంగా.. రెండు రోజులపాటు షూటింగులు నిలిపివేయాలని ఆయన సూచించారు. అయితే.. ఈ సూచనలకు భారీస్థాయిలో మసాలా దట్టించి.. చేసిన వ్యాఖ్యలే మరోసారి ఆర్జీవీని వివాదంలోకి నెట్టాయి. వరుస ట్వీట్లు చేసిన రామ్‌గోపాల్.. సినీ ఇండస్ట్రీపై అక్కసు వెళ్లగక్కారు. భక్తకన్నప్ప, కటకటాల రుద్రయ్య, తాండ్రపాపారాయుడు వంటి మహోన్నత చిత్రాలు ఇచ్చిన గొప్ప నటుడికి.. నివాళిగా ఒక్క రోజు షూటింగును కూడా ఆపలేని తెలుగు చిత్ర పరిశ్రమకు జోహార్లు.. సిగ్గు సిగ్గు! అంటూ.. పరుష వ్యాఖ్యలు సంధించారు.
అంతటితో ఆగకుండా.. “మన చావుకు విలువ ఉండాలంటే.. కృష్ణంరాజు వంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం. రెండు రోజుల పాటు షూటింగును ఆపుదాం“ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. “మనసు లేకపోయినా ఓకే.. కృష్ణరాజు లాంటి పెద్దమనిషికి విలువిద్దాం. రెండు రోజులు షూటింగు ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చయిపోతోందని, నెల రోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది“ అని అన్నారు.
అక్కడితో కూడా వర్మ ఆగిపోలేదు. “రేపు ఇదే దుస్థితిలో మీలో ఒకరు ఉంటారు(మురళీమోహన్, ప్రభాస్, మోహన్‌బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లుఅర్జున్) ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు.. మన మీద మనం ఉమ్మేసుకున్నట్టే“ అని వ్యాఖ్యానించారు. మొత్తానికి వర్మ వ్యాఖ్యలు.. ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. ప్రతి విషయంలోనూ నెగిటివిటీని చూస్తున్నారనే కామెంట్లు వస్తున్నాయి.