ఆదిపురుష్.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దాదాపు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో భారత సినిమా రికార్డుల్ని బద్ధలు కొట్టటమే ధ్యేయంగా మొదలైన ప్రాజెక్టు. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయాల్సిన ఈ మూవీ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేయటం.. అందులో రాముడు.. హనుమంతుడు.. రావణుడి రూపాల్ని అపహాస్యం చేసేలా.. వారిని తప్పుగా చూపించినట్లుగా పెద్ద ఎత్తున మండిపాటు వ్యక్తమవుతోంది.
ఇటీవల కాలంలో బాలీవుడ్ చిత్రాలపై పెరుగుతున్న ‘బ్యాన్’ డిమాండ్ కు కొనసాగింపుగా తాజా మూవీ నిలుస్తోంది. రామాయణం గురించి.. అందులోని పాత్రల గురించి దర్శకుడు ఓంరౌత్ కు తెలీదా? అన్న మండిపాటు వ్యక్తమవుతోంది. రామాయణంలో పేర్కొన్న రీతిలో రాముడు.. రావణుడు.. హనుమంతుడి పాత్రలు చూపించలేదని.. తెర మీద వారి పాత్రల్ని చూస్తే.. మత విశ్వాసాల్ని దెబ్బ తీసేలా ఉన్నాయన్న విమర్శల తీవ్రత పెరుగుతోంది.
ఇలాంటి తీరును వేరే మతానికి చెందిన వారి విషయంలో చేస్తారా? ఆ సాహసం చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి తీరును ‘బరితెగింపు’గా చూడాలన్న అభిప్రాయం సోషల్ మీడియాలో ఎక్కువ అవుతోంది. ఆదిపురుష్ లోని పాత్రలపై పెరుగుతున్న విమర్శల గురించి వివరాల్ని తెలుసుకున్న వారంతా.. సోషల్ మీడియాలో సాగుతున్న చర్చను ఫాలో అవుతున్న వారంతా.. ఆ వాదనకు తమ సంఘీభావం వ్యక్తం చేయటంతో పాటు.. ఆదిపురుష్ పై నిప్పులు చెరుగుతున్నారు.
గడిచిన కొంతకాలంగా హిందూ దేవుళ్ల విషయంలో జరుగుతున్న వివక్ష.. తామేం చేసినా తమకున్న స్వేచ్ఛతో చేస్తున్నట్లుగా సర్ది చెప్పుకోవటం.. దాన్ని తప్పు పట్టిన వారిని మూర్ఖులుగా అభివర్ణిస్తున్న వైనంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా విషయంలో చేసిన పనే.. ఆదిపురుష్ విషయంలోనూ జరగాలని చెబుతున్నారు. కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్న తీరులో.. తప్పుడు భావజాలాన్నిప్రదర్శించే వారి విషయంలో చర్యలు తీవ్రంగా ఉండాలన్న మాట వినిపిస్తోంది.
దీనికి తగ్గట్లే తాజాగా అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ సీన్లోకి వచ్చారు. ఈ సినిమాను వెంటనే బ్యాన్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. రాముడు.. రావణుడు.. హనుమంతుడి పాత్రల్ని రామాయణంలో చూపించిన తీరులో చూపించలేదన్నారు. మత విశ్వాసాల్ని దెబ్బ తీసేలా వారి రూపాలు ఉన్నాయన్నారు. అందుకే.. ఈ మూవీని తక్షణమే బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. ఈ ఇష్యూలోకి ఎంట్రీ ఇచ్చారు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. బ్రహ్మాస్త్ర ట్రైలర్ వచ్చినప్పుడు వీఎఫ్ ఎక్స్ అసలేం బాగోలేదని ట్రోల్ చేశారని.. సినిమా చూశాక ఎవరూ ట్రోల్ చేయలేదన్నారు. ట్రైలర్ చూసినప్పుడు నచ్చలేదు కానీ.. బిగ్ స్క్రీన్ మీద బాగుందన్నారని.. ఆదిపురుష్ విషయంలోనూ మన ఆలోచనలకు విభిన్నంగా ఉండేసరికి విమర్శలు చేస్తున్నారన్నారు. సైఫ్ అలీఖాన్ లుక్ తనకు నచ్చలేదన్న ఆయన.. చిన్నప్పటి నుంచి ఎస్వీ రంగారావును రావణాసురుడిగా చూడ్డానికి అలవాటు పడిన విషయాన్ని చెప్పారు. ‘రావణుడంటే పొడవాటి జుత్తు.. గంభీరమైన ఆకారం.. భారీ రూపం ఉన్నట్లు చూశా. సడన్ గా సైఫ్ ను చేసి.. ఇదేంటి ఇలా ఉన్నాడు? అని కాస్త బాధ పడ్డా.
దర్శక నిర్మాతలు కష్టపడి కోట్లు పెట్టి సినిమా చేశారంటే వాళ్లు కొత్తగా ఏదో చూపించాలని అనుకుంటారు. వాళ్ల ఆలోచన తప్పు అయితే వాళ్లే అనుభవిస్తారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఏదైనా చేసే హక్కు ఉంది’ అన్నారు. ఇలాంటి మాటలు హిందూ మతానికి సంబంధించిన అంశాల్లోనే నీతులు చెబుతారని.. ఇతర మతస్తుల విషయంలో కూడా వర్మ ఇవే మాటలు చెబుతారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తంగా.. ఆదిపురుష్ మీద విమర్శల తీవ్రత ఇప్పట్లో తగ్గేట్లుగా లేవంటున్నారు. దర్శక నిర్మాతల నుంచి సరైన సమాధానం రాకుంటే మాత్రం ఆదిపురుష్ కు మూడినట్లే అన్న మాట కచ్ఛితమని చెబుతున్నారు. కావాలంటే రాసి పెట్టుకోవాలన్న మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది.