నిత్యం తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అలవాటు. సినిమా, సెక్స్… రాజకీయాలు…ఇలా సమకాలీన విషయం ఏదైనా తనదైన శైలిలో వ్యాఖ్యానించడం ఆయనకు పరిపాటి. ఇక, కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కే ఏ పాల్ కూడా నిత్యం తన వ్యాఖ్యలతో యూట్యూబ్ లో వినోదాన్ని పంచుతుంటారు. తనను సీఎంని చేస్తే ఏపీని అమెరికా చేస్తానని, ట్రంప్ తో తాను డిన్నర్ చేస్తుంటానని చెబుతూ కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు.
ఇలా, సోషల్ మీడియాలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వీరిద్దరి మధ్య గతంలో వివాదం నడిచిన సంగతి తెలిసిందే. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రంలో తన పాత్రను అవమానించారంటూ కేఏ పాల్ కేసుల వరకూ వెళ్లారు. ఆ సమయంలో వర్మ వర్సెస్ పాల్ డిబేట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత వీరిద్దరి వ్యవహారం సద్దుమణిగింది. అయితే, తాజాగా మరోసారి వర్మ, పాల్ లు ఇద్దరూ తమ కామెంట్లతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.
పవన్ కల్యాణ్ గురించి కేఏ పాల్ మాట్లాడిన తాజా వీడియో ఒకటి వైరల్ అయింది. ‘పవన్ ఫ్యాన్స్ అందరికీ చెబుతున్నా.. పవన్ సీఎం కావాలన్నా, మినిస్టర్ కావాలన్నా.. ఆయనను ప్రజాశాంతి పార్టీలో చేరమని చెప్పండి. 42 మంది ఎంపీలను గెలిపించుకుందాం. మీరంతా ఓకే అంటే నేను ప్రధానిగా ఉంటా. పవన్ ను కావాలంటే ముఖ్యమంత్రిని చేద్దాం’ అంటూ తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో పాల్ చెప్పిన వీడియో వైరల్ అయింది.
దీంతో, మరోసారి వర్మ తన మార్క్ కామెంట్లతో పాల్ పై సెటైర్లు వేశారు. పాల్ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన వర్మ…పాల్ ను ఉద్దేశించి సెటైర్లు వేశారు. ‘హేయ్ పవన్ సార్… కాబోయే ప్రధాని చెప్పేది విను’ అంటూ వర్మ చేసిన ట్వీట్ వైరల్ అయింది.