ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై చాలాకాలంగా రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి హీరోలు నాని, సిద్ధార్థ్ లు చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. ఆ కామెంట్లకు వైసీపీ నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. సినిమా టికెట్ల వ్యవహారంలో ప్రభుత్వ జోక్యం ఏంటని వర్మ ప్రశ్నించారు.
ఓ వస్తువును తయారు చేసిన ఉత్పత్తిదారుడికే ఎమ్మార్పీ నిర్ణయించే అధికారం ఉంటుందని వర్మ లాజిక్ చెప్పారు. అది, కొనాలా? వద్దా? అనేది వినియోగదారుడు నిర్ణయించుకుంటాడని వర్మ తన మార్క్ కామెంట్లతో విరుచుకుపడ్డారు. సినిమా టికెట్ల రేట్లను నిర్మాతలు నిర్ణయించడంలో తప్పేమీలేదని వెనకేసుకొచ్చారు. ప్రభుత్వం టికెట్ల రేట్లు నిర్ణయించడం ఏంటో తనకు అర్థంకావడంలేదని వర్మ అన్నారు.
ఓ వస్తువును ప్రైవేటు వ్యక్తులు ఉత్పత్తి చేసి, వినియోగదారుడికి అమ్మే క్రమంలో పన్నులు ప్రభుత్వానికే వెళతాయని వర్మ చెప్పారు. కానీ, ఇందులో ప్రభుత్వం ధరలు నిర్ణయించడం ఉండదని వర్మ స్పష్టం చేశారు. సినిమా టికెట్ల అంశానికి కూడా ఇదే ఫార్ములా వర్తిస్తుందని స్పష్టం చేశారు. నాని, సిద్దార్థ్ లపై కౌంటర్ ఇచ్చిన ఏపీ మంత్రులు…వర్మకు కూడా కౌంటర్ ఇస్తారా…లేక వర్మతో మనకెందుకులే అని సైలెంట్ గా ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.