కందుకూరు దుర్ఘటన నేపథ్యంలో వైసీపీ నేతలు టీడీపీని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న విమర్శలపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు.
చంద్రబాబు ఇరుకు రోడ్డులో సభ పెట్టడం వల్లే తొక్కిసలాట జరిగిందని వైసీపీ నేతలు ఆరోపించడాన్ని ఆయన తప్పుపట్టారు.
కందుకూరులో చంద్రబాబు సభ పెట్టిన చోటే గతంలో జగన్, విజయమ్మలు సభ పెట్టారని ఆయన అన్నారు.
అంతేకాదు… జగన్, విజయమ్మల పాదయాత్రలలో 8 మంది మరణించారని.. 45 మంది గాయపడ్డారని వర్ల రామయ్య చెప్పారు. ఇలాంటి విషాద సమయంలో దుష్ప్రచారాలు చేయడం సరికాదని వైసీపీ నేతలకు ఆయన హితవు పలికారు.
చంద్రబాబు ప్రచార పిచ్చి కారణంగానే ప్రమాదం జరిగిందని వైసీపీ నేతలు అనడం బాధాకరమని.. జగన్, విజయమ్మల పాదయాత్రలలోనూ ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తుచేశారు.
జగన్, విజయమ్మల కార్యక్రమాలలోనూ డ్రోన్లు వాడారని.. అలాంటప్పుడు వారు కూడా ప్రచార పిచ్చితోనే అలా చేశారా అని వర్ల ప్రశ్నించారు.
కందుకూరులో ఎన్టీఆర్ సర్కిల్ కంటే పెద్దరోడ్డు వేరే ఏదీ లేదని వర్ల రామయ్య అన్నారు.
జగన్ రెడ్డి అసమర్థ పాలన కారణంగా అనేక ప్రమాదాలలో 173 మంది చనిపోయారని… కచ్చులూరు బోటు ప్రమాదంలో 55 మంది, అన్నమయ్య డ్యాం పగిలి 42 మంది, విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13.. జంగారెడ్డి కల్తీమద్యం ఘటనలో 27 మంది.. కోవిడ్ సమయంలో రుయాలో ఆక్సిజన్ సప్లయ్ ఆగిపోయి 36.. ఇలా 173 మంది జగన్ అసమర్థ పాలనకు బలైపోయారని వర్ల రామయ్య అన్నారు.
అంతేకాదు.. జగన్ శ్రీకాళహస్తిలో నిర్వహించిన సభలో స్టేజ్ కూలిపోయి 20 మంది గాయపడ్డారని.. విజయమ్మ సభల్లో వివిధ సందర్భాలలో 45 మంది గాయపడ్డారని వర్ల రామయ్య చెప్పారు.