ప్రస్తుతం ఏపీలో కొత్త మంత్రులెవరు అన్న విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. పాత మంత్రులంతా రాజీనామా చేసిన నేపథ్యంలో..ఈ రోజు గవర్నర్ దగ్గరకు కొత్త మంత్రుల జాబితా ఆమోదానికి వెళ్లనుంది. దీంతో, జగన్ కేబినెట్ 2.0లో చోటు వీరిదేనంటూ పలు పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు, పాత వారిలో 8-10 మందిని జగన్ కొనసాగిస్తున్నారని మరో 15 మంది కొత్తవారికి చోటు కల్పించనున్నారని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
పాత మంత్రులు పెద్దిరెడ్డి, కొడాలి నాని, బొత్సలు కచ్చితంగా కొత్త మంత్రివర్గంలోనూ ఉంటారని, హోం మంత్రి సుచరితపై వేటు తప్పదని, ఆ స్థానంలో మరో మహిళా నేత విడదల రజనీకి చోటు దక్కే చాన్స్ ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త మంత్రి వర్గ కూర్పుపై టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. నోరు లేని తమ దళిత హోం మంత్రి సుచరిత గారిని తొలగించి, నోరు తప్ప ఏమీలేని బూతుల మంత్రి కొడాలి నానిని కొనసాగించాలని చూడడం మంచిది కాదంటూ వర్ల రామయ్య షాకింగ్ కామెంట్లు చేశారు.
అన్న మాట మీద నిలబడి అందరినీ పీకేయండి సార్ అంటూ వర్ల రామయ్య సెటైర్లు వేశారు. మాట తప్పకండి, మడమ కూడా తిప్పకండి…ఎవరి సలహాలూ వినకండి అంటూ వర్ల రామయ్య చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు, రేపు కొత్త మంత్రివర్గం కొలువదీరనున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా నేతలకు సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి అతిథులకు సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) ఆహ్వానాలు పంపుతోంది.
రేపు ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణ సీకారం జరగనుంది. ఏపీ సచివాలయం పక్కన పార్కింగ్ స్థలంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరగనుంది. తొలి మంత్రివర్గం కూడా ఇదే చోట ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. మరి, కొత్త మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కిందన్న వ్యవహారం తేలాలంటే మరికొంత సమయం వేచి చూడక తప్పదు.