వివేకా హత్య కేసు విచారణలో వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. ఓ రకంగా చెప్పాలంటే ఈ కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రువర్ గా మారి ఇచ్చిన వాంగ్మూలంతోనే కేసు కీలక మలుపు తిరిగింది. సిబిఐ విచారణలో భాగంగా దస్తగిరి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితోపాటు పలువురి పేర్లను వెల్లడించడంతో ఈ కేసు విచారణ వేగం పుంజుకుంది. అయితే, ఈ కేసులో అప్రూవర్ గా మారి పలు సంచలన విషయాలు బయటపెట్టిన దస్తగిరి తనకు ప్రాణహాని ఉందని కొద్ది నెలల క్రితం వెల్లడించడం సంచలనం రేపుతోంది.
అయినా సరే పోలీసులు దస్తగిరికి రక్షణ కల్పించడంలో విఫలమయ్యారు అని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే, 2 రోజుల క్రితం దస్తగిరి మరోసారి తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా దస్తగిరి వ్యవహారంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. వివేకా కేసులో జగన్ ముందు నుంచి తప్పటడుగులు వేస్తున్నారని ఇవి తాజాగా తప్పుడు అడుగులుగా మారాయని వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు.
వివేక హత్య కేసు ఏ దశలో ఉందని ఏపీ డీజీపీ ఏనాడైనా సమీక్ష చేశారా అని వర్ల రామయ్య ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ కేసు విచారణ కోసం ఏపీకి వచ్చిన సిబిఐ అధికారులను కూడా భయపెట్టే స్థాయికి ఆంధ్రా పోలీసులు వెళ్లడం సిగ్గుచేటని రామయ్య అన్నారు. పోలీసుల తీరు ముద్దాయిలపై జగన్ కు ఉన్న అపార ప్రేమకు నిదర్శనమని రామయ్య విమర్శించారు. ఇలా జరగడం జగన్ రెడ్డికి ఆయన పాలనకు సిగ్గుచేటని అన్నారు.
దస్తగిరిని కొత్త పెళ్లికొడుకులా చూసుకోమని పోలీసులకు ఆదేశించాల్సిన జగన్ అలా చేయలేదని, దస్తగిరి ప్రాణాలను పోలీస్ విభాగం గాలికి వదిలేయడం బాధాకరమని అన్నారు. దస్తగిరికి రక్షణ కల్పించలేని పోలీసులు సిగ్గుపడాలని, ఈ కేసు విచారణలో న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని అన్నారు. దస్తగిరిపై ఈగ వాలకుండా చూడాల్సిన బాధ్యత కడప ఎస్పీ అన్బు రాజన్ ది అని, దస్తగిరికి ఏమైనా జరగరానిది జరిగితే దాని బాధ్యత ఆయనదేనని వర్ల రామయ్య అన్నారు.