జగన్ హయాంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని టిడిపి నేతలు చాలాకాలంగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. దళితుడైనందునే డాక్టర్ సుధాకర్ ను మానసిక చిత్రవధకు గురిచేసి ఆయన ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని, ఆయన చావుకు జగన్ ప్రభుత్వమే కారణమని గతంలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక, దళిత యువకుడికి శిరోముండనం జరిగినా, రాష్ట్రంలో దళిత మహిళలపై పలుమార్లు లైంగిక వేధింపులు జరిగినా..ఏ ఒక్కరికి న్యాయం జరగలేదని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తాజాగా దళిత మహిళపై వైసిపికి చెందిన ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారని ఆరోపణలు రావడం సంచలనం రేపింది. పోలీసులు ఆ వ్యవహారాన్ని చిన్న ఫిర్యాదుగా పరిగణించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం పై టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. ఈ సందర్భంగా జగన్ పై వర్ల రామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. దళితులపై దాడుల వ్యవహారంలో జగన్ వైఖరి చూస్తుంటే పరోక్షంగా వాటిని ఆయన ప్రోత్సహిస్తున్నారా అనే అనుమానం కలుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దళితులపై దాడులను సీఎం జగన్ ఒక్కసారి కూడా ఖండించలేదని, డిజిపి, కలెక్టర్లను పిలిచి సమీక్ష జరిపారా అని నిలదీశారు. కళ్యాణదుర్గం ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులకు జగన్ మేనమామ కాదని… కంస మామ….దొంగ మామ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. దళితులపై దాడుల గురించి జగన్ ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లలో దళితులపై ఎన్నో అరాచకాలు జరిగాయని, వాటిపై తీసుకున్న చర్యలు శూన్యం అని ధ్వజమెత్తారు.
దళితులపై దాడులు వేధింపులు చేసిన వారికి అవార్డులు రివార్డులు ఇస్తున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు. దళితులను చంపినా, నరికినా, రేప్ చేసినా వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చీమకుట్టినట్టు కూడా లేదని సంచలన ఆరోపణ చేశారు.