అయిన వారికి విస్తర్లలో కాని వారికి కంచాలలో అన్న రీతిగా జగన్ పాలన సాగుతోందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీ నేతలను ములాఖత్ కు అనుమతించారన్న అక్కసుతో రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాజారావును ప్రభుత్వం బదిలీ చేసిన వ్యవహారం సంచలనం రేపుతోంది. ఈ క్రమంలోనే ఆ బదిలీని నిలిపివేయాలంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
గతంలో అవినీతి ఆరోపణలపై అరెస్టయి చంచల్ గూడ జైల్లో ఉన్న జగన్ 16 నెలలపాటు అధికారిక అనుమతులతో తన భార్య, తల్లి, చెల్లి ఇతర కుటుంబ సభ్యులు పార్టీ నేతలతో ములాఖాత్ అయ్యారని గుర్తు చేశారు. అదేవిధంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిబంధనల పకారమే మలాఖత్ కు టీడీపీ నేతలకు అవకాశం ఇచ్చారని, అదే రాజారావు చేసిన నేరమా అని ఆయన ప్రశ్నించారు. గిరిజనుడైన రాజారావును అనుమతి ఇచ్చారన్న కారణంతో బదిలీ చేయడం ఏమిటని మండిపడ్డారు.
తన 32 సంవత్సరాల సర్వీసులో ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ప్రభుత్వానికి సేవలందించిన రాజారావును బదిలీ చేయడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఏమాత్రం నైతిక విలువలున్నా వెంటనే రాజారావు బదిలీని వెనక్కి తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.