ఏపీలో ‘స్పందన’ కార్యక్రమంతోపాటు అనేక చోట్ల పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించేందుకు ‘జగనన్నకు చెబుదాం’ అనే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ఈ రోజు అట్టహాసంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రజా సమస్యల పరిష్కారం కోసం 1902 టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమాన్ని సీఎం జగన్ ఈరోజు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఆ కార్యక్రమంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినరోజే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మీడియా సాక్షిగా ఆ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ప్రభుత్వం పరువు తీశారు. తాను 1902 కి ఫోన్ చేశానని, కానీ కాసేపు లైన్ లో వేచి ఉండాలంటూ ఒక మహిళ వాయిస్ వినిపిస్తోందని వర్ల రామయ్య చెప్పుకొచ్చారు. తన సమస్యలు జగనన్నకే చెబుతానని, కానీ, 4 నిమిషాలపాటు వేచి ఉన్నా ఆమె స్పందించలేదని ఎద్దేవా చేశారు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు సమస్యలు పరిష్కరించమని కోరుతానని మీడియా ముందు ఆ కార్యక్రమం పరువు తీశారు వర్ల రామయ్య.
ఇక, నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవితం సమస్యల వలయంగా మారిందని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. ఏపీలో సమస్యలు లేని వారంటూ ఎవరైనా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. అమరావతి రైతులు మొదలుకొని జీతం కోసం ఎదురుచూసే ఉద్యోగులు, సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులు, పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వృద్ధుల సమస్యలు పరిష్కరించగలరా అని నిలదీశారు. వందల టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టినప్పటికీ ఆ జంక్షన్ బాక్సులు జామ్ కావాల్సిందేనని, సమస్యలు మాత్రం పరిష్కారం అయ్యే పరిస్థితి లేదని జగన్ ప్రభుత్వం పై గంటా విమర్శలు గుప్పించారు.