ఇటీవల కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా ఏపీ పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడిన సంగతి తెలిసిందే. ఏపీ పోలీసులు నిద్రపోతున్నారని, వారు యూనిఫాం విప్పేయాలని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పర్యటన సందర్భంగా పోలీసుల తీరుతో విసిగిపోయిన చంద్రబాబు…వారిపై ఫైర్ అయ్యారు. ఇక, రాష్ట్రంలోని పలువురు ఎస్పీలు, పోలీసులు వైసీపీ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డిపై టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు.
రిషాంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఏపీ డీజీపీకి వర్ల రామయ్య లేఖ రాశారు. వైసీపీకి అనుకూలంగా రిషాంత్ వ్యవహరిస్తూ, టీడీపీ శ్రేణులను టార్చర్ పెడుతున్నారని ఆ లేఖలో వర్ల పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాల ప్రకారమే టీడీపీ నేతలు, కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
నర్సీపట్నంలో విధులు నిర్వహించే సమయంలో టీడీపీ కార్యకర్త యేలేటి సంతోష్ ను రిషాంత్ రెడ్డి టార్చర్ చేశారని, దీంతో, సంతోష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. సంతోష్ కు పరిహారం ఇవ్వాలన్న జాతీయ మానవ హక్కుల కమిషన్ ఉత్తర్వులను కూడా బేఖాతరు చేశారని, దీంతో, పోలీసులు తనకు న్యాయం చేయడం లేదని సంతోష్ కోర్టును ఆశ్రయించాడని చెప్పారు.
డిసెంబర్ 5న చీఫ్ సెక్రటరీ తమ ముందు హాజరు కావాలని ఎన్ హెచ్చార్సీ ఆదేశించిందని, ఈ క్రమంలోనే నిన్న హడావుడిగా పరిహారం ఇస్తూ పోలీసు శాఖ ఉత్తర్వులిచ్చిందని వర్ల చెప్పారు. ఎస్పీ పదవికి రిషాంత్ రెడ్డి పనికిరారని, రిషాంత్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.