జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వారాహి యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు ఆయన పిఠాపురం, కాకినాడ, సర్పవరం.. తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అయితే.. తాజాగా శనివారం నిర్వహించాల్సిన వారాహి యాత్రకు బ్రేక్ ఇస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. నిజానికి షెడ్యూల్ ప్రకారమే ఈ యాత్ర జరుగుతోంది.
ప్రభుత్వం వైపు నుంచి కానీ.. పోలీసుల నుంచి కానీ.. ఆదిలో కొన్ని ఆటంకాలు ఎదురైనా.. వాటన్నింటినీ అధిగమించినపవన్.. వారాహి యాత్రను సక్సెస్ చేసేలా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు… ప్రభుత్వంపైనా.. పంచ్‌లు పేలుస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం నుంచి ఎమ్మెల్యేలు, పొత్తుల ద్వారా.. అనేక విషయాలపై ప్రజలకు క్లారిటీ ఇస్తున్నారు. దీంతో వారాహి యాత్రకు యువత నుంచి మంచి స్పందనే వస్తోంది.
ఇక, శనివారం మలికిపురంలో వారాహి యాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. జనసేన అభి మానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే. అనూహ్యంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం ఈ ప్రాంతాన్ని ముంచెత్తింది. శనివారం ఉదయం కూడా మలికిపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో జల్లులు కురుస్తున్నాయి. మరోవైపు.. అభిమానులు కూడా ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.
దీనిని దృష్టిలో ఉంచుకున్న పవన్ కళ్యాణ్.. శనివారం వారాహియాత్రకు బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే.. రోజూ నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని మాత్రం సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని.. ఆయన తెలిపారు. అదేవిధంగా శనివారం తలపెట్టిన వీర మహిళల సభను కూడా అంతర్గతంగా నిర్వహిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.