జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్ర కోసం సిద్ధం చేసుకున్న ‘వారాహి’ వాహనం వ్యవహారం ఏపీ రాజకీయాలలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ వాహనం రంగు, రీమోడల్ తదితర అంశాల పై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా…తనపై కక్ష సాధించేందుకే ఆఖరికి బస్సుపై కూడా వివాదం రేపారని జనసేన నేతలు అంటున్నారు. దీంతో, ఈ ఇష్యూపై జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ నేతలకు షాక్ తగిలింది. వారాహి వాహనం రవాణా శాఖ అనుమతులన్నీ పొందిందని తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు వెల్లడించారు. వారం క్రితమే వారాహి రిజిస్ట్రేషన్ పూర్తయిందని, ఆ వాహనం బాడీకి సంబంధించిన సర్టిఫికెట్ ను పరిశీలించామని చెప్పారు. TS 13 EX 8384 నెంబరును వారాహికి కేటాయించినట్టు తెలుస్తోంది. ఇక, ఆ వాహనం రంగు ‘ఆలివ్ గ్రీన్’ కాదని, ‘ఎమరాల్డ్ గ్రీన్’ అని, నిబంధనలకు లోబడే ఉందని తెలపడంతో వారాహికి క్లియరెన్స్ లభించినట్లయింది.
మరోవైపు, ఏపీలో మాండూస్ తుపాను బాధితులకు తక్షణ ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని జనసేనాని పవన్ డిమాండ్ చేశారు. ఈ తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, గిట్టుబాటు ధరలు లేక, ప్రభుత్వ సహాయ సహకారాలు అందని రైతులను తుపాను కూడా దెబ్బతీసిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇంత నష్టం జరుగుతున్నా మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదని, వారికి ధైర్యం చెప్పడంలేదని పవన్ విమర్శించారు.
ప్రత్యర్థి పార్టీల నేతలను తిట్టడానికి, ఏ తిట్లు తిట్టాలో కూడా స్క్రిప్టులు రాసి మరీ నేతలను పంపే తాడేపల్లి పెద్దలు….ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండాలని వారికి స్క్రిప్ట్ ఎందుకు ఇవ్వరని పవన్ ప్రశ్నించారు.