జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఊహించిన దానికంటే ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండు విడతల వారాహి యాత్రకు ప్రజలు, జనసైనికులు బ్రహ్మరథం పట్టారు. ఇక, రెండో విడత వారాహి యాత్ర సందర్భంగా వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా మూడో విడత వారాహి యాత్ర చేసేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారు. మూడో విడత వారాహి విజయ యాత్ర విశాఖ నుంచి ఈ నెల 10వ తేదీన ప్రారంభం కానుందని అధికారికంగా ప్రకటన వెలువడింది.
వివిధ కమిటీలతో సమావేశమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాత్ర తేదీలను నిర్ణయించారు. ఈ సందర్భంగా ఏపీ పోలీసులపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా గురించి తాను మాట్లాడితే పోలీసులు ప్రశ్నించారని, కానీ, ఆ విషయంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో గణాంకాలతో సహా వివరించిందని పవన్ గుర్తు చేశారు. వాలంటీర్ వ్యవస్థపై తాను చేసిన విమర్శలు, ఆరోపణలు పెందుర్తిలో రుజువయ్యాయని పవన్ చెప్పారు. వాలంటీర్ ఓ వృద్ధురాలిని హత్య చేయడం బాధించిందన్నారు.
కాగా, ఆగస్టు 10న విశాఖ నుంచి మూడో విడత వారాహి యాత్ర ప్రారంభం కానుంది. అదే రోజున విశాఖలో భారీ బహిరంగ సభ ఉంటుంది. ఈ యాత్ర ఆగస్టు 19వ తేదీ వరకు కొనసాగుతుంది. విశాఖలో భూకబ్జాలకు సంబంధించి పవన్ క్షేత్రస్థాయి పరిశీలనలు చేయబోతున్నారని జనసేన పార్టీ తెలిపింది. పర్యావరణానికి హాని కలిగించేలా ధ్వంసం చేసిన ప్రాంతాలను పవన్ కల్యాణ్ సందర్శించనున్నారని వెల్లడించింది. గతంలో మాదిరిగానే విశాఖలో జనవాణి కార్యక్రమం ఉంటుందని, పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటారని వెల్లడించింది.