ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దాదాపు గంటన్నరకుపైగా సాగిన ఈ భేటీలో పలు కీలక విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వంగవీటి రాధాకు చంద్రబాబు నుంచి పిలుపు రావడంతో ఆయన వెంటనే స్పందించారు. ఎమ్మెల్సీ సీటు ఆశించన రాధాకు భంగపాటు తప్పలేదు. ఈ క్రమంలోనే త్వరలో భర్తీ కానున్న కీలకమైన నామినేటెడ్ పోస్టు ఒకటి రాధాకు ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది.
తమ నాయకుడికి ఎమ్మెల్సీ సీటు దక్కకపోవడంపై రాధా అనుచరులు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో అయినా రాధాకు న్యాయం జరగాలని వారు భావిస్తున్నారట. ఈ క్రమంలోనే రాధాకు చంద్రబాబు నుంచి పిలుపు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాధాకు నామినేటెడ్ పోస్టు పక్కా అని, ఏ పోస్టు దక్కుతుంది అన్న సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. వంగవీటి మోహన రంగా వారసుడు రాధాకు ఏదో ఒక కీలక పదవి దక్కుతుందని కాపు నేతలు భావిస్తున్నారు.
2019 నుంచి టీడీపీలోనే ఉన్న రాధా టీడీపీ కష్టకాలంలో ఉన్న సమయంలో కూడా పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. వైసీపీలోకి రావాలని కొడాలి నాని, వల్లభనేని వంశీ రాయబారం నడిపినా రాధా మాత్రం టీడీపీని వీడలేదు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొని వైసీపీపై విమర్శలు గుప్పించారు.