ఎవరికీ లేనంత స్ట్రాంగ్ బ్యాగ్రౌండ్ ఉంది. రాష్ట్రంలోనే జనాభా పరంగా అతిపెద్ద కులం అండగా ఉంది. రాజకీయంగా అత్యంత క్రియాశీలక ప్రాంతంలో ఉన్నారు. అయినా తన అనుకూలతలను, బలాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు విజయవాడకు చెందిన ప్రముఖ నేత వంగవీటి రాధా.
వంగవీటి రంగా అంటే రాష్ట్రమంతటా తెలుసు. అతను చనిపోయి సుమారు 30 ఏళ్ళయిపోయినా ఇంకా రంగాను తలచుకుంటునే ఉంటారు. పైగా కాపు సామాజికవర్గంలో రంగా అంటే ఓ బాహుబలి. అలాంటి వ్యక్తి కొడుకు అయిన వంగవీటి రాధా… రాజకీయ పయనం నిర్ణయాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఉన్నచోట ఉండరు. ఇంక దేనికోసమో పాకులాడుతారు. ఈ క్రమంలో ఉన్నదీ దక్కదు, ఆశించినదీ రాదు అన్నట్టు ఉంటుంది రాధా పరిస్థితి.
నిలకడ లేని తనం, రాజకీయ బద్ధకం… రాంగ్ టైమింగ్ కలిసి వంగవీటి రాధాను ఎటుకాకుండా చేస్తున్నాయి. ఆయన టీడీపీలో ఉన్నారు. కానీ వైసీపీలో చేరతారు అని వచ్చిన వార్తలను బలంగా ఖండించలేదు. పోనీ ఆ పార్టీలోను చేరలేదు. కొన్నిరోజుల క్రితమే చంద్రబాబును కలిసిన వంగవీటిరాధా మళ్లీ తనంతట తానే పవన్ ను, నాదెండ్లను కలిసి కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్నారో ఆయనకు అయినా ఒక క్లారిటీ ఉంటే మంచిది.