ఆర్థికంగా వెనుకబడిన వారు.. పేదరికంతో ఇబ్బంది పడుతున్న వారికి చేయూతను ఇవ్వడం ద్వారా ఆనందం వెతుక్కునే వారు అరుదుగా ఉంటారు. అలాంటి కోవకు చెందిన వారు ‘శశికాంత్ వల్లేపల్లి-ప్రియాంక వల్లేపల్లి’ కుటుంబం.సామాజిక సేవలో వారిది వెన్నెముక లేని చేయి. ఆర్థిక కారణాలతో చదువు ఆగిపోయే ప్రమాదం ఉన్న ప్రతిభ కలిగిన విద్యార్థులకు దన్నుగా నిలిచేందుకు వారు ముందడుగు వేశారు. చదువుకోవాలన్న ఆసక్తితో పాటు.. ప్రతిభ ఉండి, ఆర్థిక కారణాల వల్ల చదువు ఆగిపోకుండా ఉండేందుకు గడిచిన కొన్నేళ్లుగా వీరు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది తూర్పుగోదావరి జిల్లాలో 40 మంది విద్యార్థులకు సాయాన్ని అందించారు. ఇప్పటివరకు కొన్ని వందల మందికి స్కాలర్ షిప్ లను అందించారు.
తాజాగా కాకినాడలోని మహర్షి సాంబమూర్తి సంస్థ ప్రాంగణంలో పడాల చారిటబుల్ ట్రస్టు ప్రతినిధులు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధులుగా డీఐజీ మోహన్ రావు.. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నా నయిమ్ అస్మీ హాజరయ్యారు. ‘తానా’లాంటి సంస్థల కారణంగా వందలాది మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యకు అవసరమైన సాయాన్ని అందిస్తున్న తీరును ప్రస్తావించి.. సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాకినాడకు చెందిన పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
‘తానా చేయూత’ అనే పేరుతో ఈ కార్య క్రమాన్ని నిర్వహించారు ‘తానా’కు చెందిన జయ శేఖర్ తాళ్ళూరి, నిరంజన్ తో పాటు ఇతర సభ్యులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.