గన్నవరం లోని టీడీపీ ఆఫీసుపై 2021-22 మధ్య జరిగిన దాడి, ఘర్షణకు సంబంధించిన వ్యవహారం తారస్థాయికి చేరుకుంది. నిన్న మొన్నటి వరకు కేవలం నాలుగైదు జిల్లాలకు మాత్రమే పరిమితమైన ఈ వ్యవహారం.. ఇప్పుడు రాష్ట్రస్థాయిలో చర్చకు వచ్చింది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు, జైలు.. తర్వాత మంగళవారం జగన్ ఆయనను పరామర్శించడంతో ఈ కేసు వ్యవహారం ఏంటనేది సోషల్ మీడియాలో అత్యంత ఆసక్తికర విషయంగా మారింది. మంగళవారం రాత్రికి గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన అంశంగా కూడా గన్నవరం టీడీపీ ఘటన రికార్డు సృష్టించింది.
మరీ ముఖ్యంగా జగన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు, విమర్శలు మంగళవారం హైలెట్‌గా నిలిచాయి. ఇదిలావుంటే.. ఈ ఘటనలో వంశీ ని అక్రమంగా అరెస్టు చేశారని చెప్పిన జగన్.. కుట్ర మొత్తం సీఎం చంద్రబాబు(అప్పట్లో ప్రతిపక్ష నాయకుడు), నారా లోకేష్ దగ్గరే జరిగిందని.. దీనికి మరో సీనియర్‌నేత, ప్రస్తుత స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరాం సహకరించాడని.. ఆయన రెచ్చగొట్ట డంతోనే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందన్నారు. అంతేకాదు.. వంశీ అరెస్టుకు ప్రాతిపదిక అయిన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త.. సత్యవర్థన్ ను అసలు.. వంశీ కానీ. ఇతర నాయకులు కానీ బెదిరించలేదని కూడా జగన్ చెప్పారు.
అంతేకాదు.. దీనికి సంబంధించి సత్యవర్థన్ కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం(స్టేట్మెంట్) కూడా తమ వద్ద ఉందన్న జగన్.. మంగళవారం రాత్రి అధికారిక వైసీపీ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు చేశారు. `వంశీ అరెస్టు లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ కుట్రలు. గన్నవరం కేసులో కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలు, అక్రమ అరెస్టులు. కోర్టు ముందు సత్యవర్థన్ స్టేట్మెంటే అందుకు నిదర్శనం. చంద్రబాబు సర్కార్ కుట్రను బయటపెట్టిన సత్యవర్థన్ ఫిబ్రవరి 10, 2025 నాటి స్టేట్మెంట్. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడలేనన్న సత్యవర్థన్. టీడీపీ నాయకుడు బచ్చుల సుబ్రహ్మణ్యం ఈ కేసులో సాక్షిగా తన వద్ద సంతకం తీసుకున్నాడని వెల్లడి. తనను ఎవరూ బలవంతం పెట్టలేదని కూడా కోర్టులో వెల్లడి. కోర్టు ఎదుట సత్యవర్థన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇదీ` అని వైసీపీ పోస్టు చేసింది.
అయితే.. దీనికి టీడీపీ బలమైన కౌంటర్ ఇచ్చింది. ఏ విషయంలో అయితే.. సత్య వర్ధన్ స్టేట్మెంటు ఇచ్చాడని వైసీపీ ఆరోపించిందో.. సదరు స్టేట్మెంటును సోషల్ మీడియాలో పెట్టిందో..అదే అంశానికి సంబంధించి ఏకంగా వీడియోను టీడీపీ విడుదల చేసింది. ఈ వీడియోలో వంశీ, ఆయన అనుచరులు తమ ఎదురుగా ఉన్న సత్యవర్థన్‌ను బెదిరిస్తుండడం స్పష్టంగా కనిపించిం ది. అంతేకాదు.. ఈ ఘటనలో కేసులో ప్రమేయం ఉన్న ప్రతిఒక్కరూ ఉన్నారు. దీంతో వైసీపీ విడుదల చేసిన స్టేట్మెంటు.. సదరు సత్యవర్ధన్‌ను వంశీ ఆయన అనుచరులు కిడ్నాప్ చేసి.. బెదిరించిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంటుగా నిర్ధారణ అయిందని టీడీపీవర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి గన్నవరం విషయంలో.. స్టేట్ మెంట్ వర్సెస్ వీడియో ఇప్పుడు సంచలనంగా మారడం గమనార్హం.