గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ టీడీపీ ఆఫీసు దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్య వర్ధన్ ను అపహరించి బెదిరించిన వ్యవహారంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. వంశీ అరెస్టుతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. అధికార టీడీపీ విపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అక్రమంగా వల్లభనేని వంశీ పై కిడ్నాప్ కేసు పెట్టి అరెస్టు చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరోవైపు అరెస్టు అయిన నేపథ్యంలో వల్లభనేని వంశీకి సంబంధించి అనేక విషయాలు తెరపై వస్తున్నాయి.
ఈ క్రమంలోనే వల్లభనేని వంశీ నిర్మించిన సినిమాల లిస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తన స్నేహితుడు కొడాలి నానితో కలిసి వంశీ గతంలో పలు సినిమాలను ప్రొడ్యూస్ చేశాడు. ఈ లిస్టులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిట్ మూవీ కూడా ఉంది. ఇంతకీ ఆ చిత్రం మరేదో కాదు `అదుర్స్`. 2010లో విడుదలైన అదుర్స్ చిత్రానికి వి.వి వినాయక్ దర్శకుడు కాగా.. వైష్ణవి ఆర్ట్స్ బ్యానర్ పై వల్లభనేని వంశీ మూవీని నిర్మించారు. అప్పట్లో ఈ చిత్రం కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిలిచింది. వంశీకి మంచి లాభాలను తెచ్చిపెట్టింది.
అదుర్స్ కంటే ముందు 2009లో వచ్చిన `పున్నమినాగు` చిత్రంతో వల్లభనేని వంశీ, కొడాలి నాని నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. పున్నమినాగు, అదుర్స్ చిత్రాల అనంతరం కొంత గ్యాప్ తీసుకున్న వల్లభనేని వంశీ.. మళ్లీ 2010లో మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కిన `టచ్ చేసి చూడు` చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక పొలిటికల్ కెరీర్ విషయానికి వస్తే.. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంశీ వైసీపీ అభ్యర్థి దుట్టా రామచంద్రరావును ఓడించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ గాలిని తట్టుకుని మరోసారి టీడీపీ అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికైన వంశీ.. ఆ తర్వాత జరిగిన పరిణామాల నడుమ వైసీపీలో చేరి టీడీపీకి వ్యతిరేకంగా మారి వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడ్డారు. 2024లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.